Jagan: కృష్ణా జిల్లా పేరు మార్పు ప్రకటనపై.. జగన్ కు సొంత పార్టీలోనే వ్యతిరేకత
- కృష్ణా జిల్లా పేరు మారిస్తే ఊరుకోం
- కృష్ణమ్మ నీరు తాగాం, తిండి తిన్నాం, గాలి పీల్చాం.. పేరు మార్చొద్దు
- ఎన్టీఆర్ మీద ప్రేమ ఉంటే.. విగ్రహాలు పెట్టుకోండి
కృష్ణా జిల్లాకు దివంగత ఎన్టీఆర్ పేరు పెడతామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటనపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తోంది. వైసీపీ రాష్ట్ర రాజకీయ సలహాదారు దుట్టా రామచంద్రరావు ... జగన్ ప్రకటనను తప్పుబట్టారు. కృష్ణమ్మ ఎన్నో రాష్ట్రాలు దాటుకుని ఏపీలో ప్రవహిస్తోందని... కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తోందని అన్నారు.
ఏ రాష్ట్రంలోనూ కూడా కృష్ణా పేరుతో జిల్లా లేదని... మన రాష్ట్రంలో మాత్రమే ఉందని, అలాంటి మహా తల్లి పేరును మారిస్తే సహించబోమని హెచ్చరించారు. జగన్ తన హామీని వెంటనే ఉపసంహరించుకోవాలని... లేకపోతే పార్టీకి రాజీనామా చేసి, ఆమరణ దీక్ష చేపడతానని అన్నారు. కృష్ణా జిల్లా పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి, ఉద్యమిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ మీద అంత అభిమానం ఉన్నప్పుడు విగ్రహాలు పెట్టుకోవాలని, స్మారక భవనాలు కట్టుకోవాలని... జిల్లా పేరును మార్చడానికి మాత్రం ఒప్పుకోబోమని తెలిపారు.