Movie: ప్రొద్దుటూరులో 'అవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' 3డీ వెర్షన్ చూస్తూ గుండెపోటుతో మరణించిన ప్రేక్షకుడు!
- సినిమా ముగిసినా లేవని ప్రేక్షకుడు
- ఆసుపత్రికి తరలిస్తే అప్పటికే మృతి
- భయంతో గుండెపోటు వచ్చుండవచ్చని అనుమానం
గతవారం రిలీజైన హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం 'అవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్'ను త్రీడీ వెర్షన్ లో చూస్తున్న సినీ ప్రేక్షకుడు గుండెపోటుతో మరణించిన ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పట్టణ పరిధిలోని శ్రీనివాసనగర్ కు చెందిన బేల్దారీ మేస్త్రీ బాషా, సినీ హబ్ థియేటర్ లో సినిమా చూసేందుకు వెళ్లాడు. చిత్ర ప్రదర్శన ముగిసిన తరువాత అందరూ వెళ్లిపోయినా, అతను లేవలేదు.
పక్కనున్నవారు పిలిచినా పలక్క పోయేసరికి, థియేటర్ యాజమాన్యం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాషా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తన భర్తకు గ్యాస్ ట్రబుల్ మినహా మరే ఇతర రోగాలు లేవని ఆయన భార్య వాపోయింది. కాగా, త్రీడీ సినిమాను చూస్తున్న సమయంలో, కొన్ని దృశ్యాలు మీదకు వచ్చి పడుతున్నట్టు కనిపిస్తుంటాయి. దీంతో మృతుడు కొత్తగా త్రీడీ సినిమా చూస్తుండవచ్చని, అందువల్లే భయంతో గుండెపోటు వచ్చి మరణించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.