oppo: అమేజాన్, ఒప్పో భాగస్వామ్యంలో ‘రియల్ మీ 1’ ఫోన్... ఈ నెల 15న ఆవిష్కరణ
- వెనుక భాగంలో డైమండ్ డిజైన్
- వినియోగదారులను సంతృప్తి పరిచేలా ఉంటుందని ప్రకటన
- ఫోన్లో సమస్య ఏర్పడితే గంటలోపే రిపేర్ చేసి ఇచ్చేలా హామీ
అమేజాన్, చైనాకు చెందిన ఒప్పో సంయుక్తంగా ‘రియల్ మీ 1’ పేరుతో స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తున్నట్టు స్పష్టమైంది. ఈ వివరాలను అమేజాన్ ఇండియా తన అమేజాన్ డాట్ ఇన్ వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. ఈ నెల 15న ఈ ఫోన్ వివరాలను వెల్లడించనున్నట్టు పేర్కొంది. ఆ రోజు వివరాలను వెల్లడిస్తుందా లేక ఫోన్ ను ఆవిష్కరించనుందా? అన్న క్లారిటీ అయితే లేదు. ఈ ఫోన్ కేవలం అమేజాన్ వెబ్ సైట్లోనే విక్రయానికి లభించనుంది.
సాధారణ డిజైన్లకు భిన్నంగా వెనుక భాగంలో డైమండ్ డిజైన్ తో ఉంటుంది. రియల్ మీ ఫోన్ ఆన్ లైన్ వినియోగదారుల అవసరాలను సంతృప్తి పరిచేలా ఉంటుందని, అధునాతన డిజైన్, ముఖ్యమైన స్పెసిఫికేషన్లు, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో, మెరుగైన నాణ్యతతో ఉంటుందని రియల్ మీ ఇండియా తెలిపింది. ఒప్పో ఎఫ్ 7 ఫోన్లోనూ వెనుక భాగం బ్లాక్ డైమండ్ డిజైన్ తో ఉంటుందని తెలిసిందే.
10,000 డ్రాప్ టెస్ట్ లు (కింద పడేసి చూడడం), లక్ష సార్లు బటన్ టెస్ట్ లు, 10,000 యూఎస్ బీ టెస్ట్ లు చేసినట్టు కంపెనీ ప్రకటించింది. ఫోన్లో సమస్య వస్తే గంటలోపే రిపేర్ చేసి ఇస్తామనే హామీని ప్రకటించింది. ఫోన్ పట్ల ఆసక్తి కలిగిన వారు అమేజాన్ వెబ్ సైట్లో ‘నోటిఫై మీ అన్న చోట’ తమ ఈ మెయిల్ ఐడీ ఇస్తే ఫోన్ విడుదల రోజున సమాచారం అందిస్తుంది.