KCR: కేసీఆర్‌ను గుర్తుపట్టలేకపోయిన కరుణానిధి.. పరిచయం చేసేందుకు ప్రయత్నించినా విఫలం!

  • జ్ఞాపకశక్తి పూర్తిగా కోల్పోయిన కరుణానిధి
  • శ్వాస నాళానికి శస్త్రచికిత్స జరగడంతో మాట్లాడలేకపోతున్న నేత
  • ఫెడరల్ ఫ్రంట్ గురించి డీఎంకే నేతలకు వివరించిన కేసీఆర్

ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడం ద్వారా అధికార బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం తమిళనాడు వెళ్లి డీఎంకే నేతలను కలిసి తాను ఏర్పాటు చేయబోయే ఫ్రంట్ పూర్వాపరాలను వివరించారు. అలాగే డీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, 93 ఏళ్ల వయో వృద్ధుడు కరుణానిధిని కలిశారు.

జ్ఞాపకశక్తి పూర్తిగా కోల్పోయిన కరుణానిధి ఎవరినీ గుర్తు పట్టలేకపోతున్నారు. ఆదివారం తన వద్దకు వచ్చిన కేసీఆర్‌ను కూడా ఆయన గుర్తుపట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. టీఆర్ బాలు, స్టాలిన్‌లు కేసీఆర్‌ను పరిచయం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన గుర్తు పట్టలేకపోయారు. అంతేకాదు.. శ్వాసనాళానికి శస్త్ర చికిత్స కూడా జరగడంతో ఆయన ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నారు.

కాగా, సోమవారం మధ్యాహ్నం కేసీఆర్.. డీఎంకే ఎంపీ కనిమొళితో గంటపాటు సమావేశమై దేశ రాజకీయాలపై చర్చించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే సమాఖ్య స్ఫూర్తి మరింతగా పరిఢవిల్లుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ తదితర వాటి గురించి కేసీఆర్ వివరించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పార్టీల ఐక్యతకు కేసీఆర్ చేస్తున్న కృషిని కనిమొళి కొనియాడారు. త్వరలోనే హైదరాబాద్ వస్తానని ఆమె హామీ ఇచ్చారు. అయితే, తమ భేటీకి ఎన్నికల ప్రాధాన్యం లేదని కనిమొళి విలేకరులతో పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News