Marriage: పెళ్లయి తొమ్మిదేళ్లయినా జరగని శోభనం... వివాహాన్ని రద్దు చేసిన బాంబే హైకోర్టు!
- కీలక తీర్పిచ్చిన బాంబే హైకోర్టు
- తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నారన్న యువతి
- 9 సంవత్సరాలు సాగిన విచారణ
- ఎట్టకేలకు తీర్పు వెల్లడి
పెళ్లయి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా, ఇంతవరకూ శోభనం కాని ఓ జంట పెళ్లి చెల్లదంటూ బాంబే హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కొల్హాపూర్ కు చెందిన ఓ జంట, తమ పెళ్లయిన నాటి నుంచి కోర్టు కేసును ఎదుర్కొంటోంది. తనను మోసం చేసి వివాహం చేసుకున్నారని, ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపిస్తూ, ఓ యువతి 2009లో కోర్టు మెట్లు ఎక్కగా, ఆ కేసు విచారణ ఇంతకాలం సాగింది. కేసును విచారించిన న్యాయమూర్తి మృదులా భట్కర్ తీర్పును ఇస్తూ, పిటిషనర్ భర్త మోసం చేశారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పింది.
తొమ్మిది సంవత్సరాల పాటు లైంగిక సంబంధం లేని కారణంగా ఆ జంటకు విడాకులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. వివాహబంధానికి స్త్రీ పురుషుల మధ్య లైంగిక సంబంధం అత్యంత ముఖ్యమని అభిప్రాయపడ్డ న్యాయమూర్తి, ఆ జంట మధ్య సంబంధం లేదంటే, పెళ్లికే అర్థం లేదని వ్యాఖ్యానించారు. ఒక్కసారి కూడా శారీరకంగా కలవని ఈ జంట వివాహ బంధానికి ఎంతమాత్రమూ విలువను ఇవ్వలేదని తెలిపారు. ఈ కేసులో థర్డ్ పార్టీగా చేరిన మహిళ పెద్దలు, వారిద్దరికీ శోభనం జరిగిందని, ఆమె గర్భవతి అయిందని సాక్ష్యం ఇవ్వగా, గైనకాలజిస్టులతో కోర్టు పరీక్షలు చేయించి, ఆ సాక్ష్యం తప్పుడుదని తేల్చింది. సాక్ష్యాలన్నీ పరిశీలించిన మీదట, ఈ వివాహాన్ని రద్దు చేస్తున్నట్టు న్యాయమూర్తి తుది తీర్పు నిచ్చారు.