Jagan: ఇవన్నీ జగన్ చేసిన వంచనలు కాదా?: యనమల
- వంచకులకు నయవంచన దినం పాటించే అర్హత లేదు
- రాజభవనాలను నిర్మించుకున్నది ప్రజల సొమ్ముతో కాదా?
- మోదీని ఎందుకు ప్రశ్నించడం లేదు?
- జగన్ కన్నా పెద్ద వంచకుడు ఎవరున్నారు?
తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్ష కోట్లు దోచుకోవడం ప్రజలను వంచించడం కాదా? అంటూ వైసీపీ అధినేత జగన్ పై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. వంచకులకు నయవంచన దినం పాటించే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసాన్ని ఎండగడుతూ... వైసీపీ చేపట్టిన వంచన వ్యతిరేక దీక్షపై యనమల మాట్లాడుతూ ఈ మేరకు విమర్శలు గుప్పించారు.
హైదరాబాదులోని లోటస్ పాండ్, బెంగళూరులోని యలహంక, ఇడుపులపాయల్లో రాజ భవనాలను జగన్ నిర్మించుకున్నది ప్రజల సొమ్ముతో కాదా? అని ప్రశ్నించారు. పేదల సొమ్మును దోచుకున్న జగన్ కన్నా పెద్ద వంచకుడు ఎవరున్నారని అన్నారు. నాలుగు రోజుల పాటు పాదయాత్ర, రెండు రోజులు లాయర్లతో చర్చలు, ఒక రోజు కోర్టు బోనులో నిలబడటం... ఇది వంచన కాదా? అని యనమల ప్రశ్నించారు.
విభజన సమయంలో సోనియాగాంధీతో లాలూచీ పడి, బెయిల్ తెచ్చుకోవడం వంచన కాదా? అని అడిగారు. పోలవరం ప్రాజెక్టును ఫిర్యాదులు, కోర్టు కేసులతో అడ్డుకోవడం వంచన కాదా? అని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకానికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాయించి... పేదలకు కూలీ కూడా లేకుండా చేయడం వంచన కాదా? అని అడిగారు. అమరావతిపై కేసులు వేయించి, ల్యాండ్ పూలింగ్ ను అడ్డుకోవడం వంచన కాదా? అని నిలదీశారు.
రాష్ట్రానికి బీజేపీ నమ్మకద్రోహం చేస్తే... ఆ పార్టీని ప్రశ్నించకపోవడం వంచన కాదా? అన్నారు. తన ప్రసంగాలలో ప్రధాని మోదీ పేరును కూడా జగన్ ఎత్తకపోవడం మోసం కాదా? అని ప్రశ్నించారు. మోదీని ప్రశ్నిస్తే బేడీలు పడతాయనే భయం జగన్ లో ఉందని ఎద్దేవా చేశారు.