Legless Dancer: ప్రపంచ రికార్డుకు ప్రయత్నించి.. ఐసీయూకి చేరిన లెగ్‌లెస్ డ్యాన్సర్!
- రెండు కాళ్లు లేకుండా జన్మించిన వినోద్
- డ్యాన్సర్‌గా, స్టంట్ మాస్టర్‌గా విశేష గుర్తింపు
- గిన్నిస్ బుక్‌లో చోటు కోసం సాహసం
- ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న వినోద్
ప్రపంచ రికార్డు సృష్టించాలనుకున్న ‘లెగ్‌లెస్ డ్యాన్సర్’ చివరికి ఆసుపత్రిలోని ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. లెగ్‌లెస్ డ్యాన్సర్‌గా చిరపరిచితుడైన బీహార్‌కు చెందిన వినోద్ ఠాకూర్ వీల్‌చైర్‌పై 1500 కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించాలని నిర్ణయించాడు. అందులో భాగంగా మార్చి 18న ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. 40 రోజుల్లో దాదాపు 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. ఈ క్రమంలో ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియాకు చేరుకునే క్రమంలో మలాడ్ వద్ద ఆదివారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. నిజానికి నేడు (ఏప్రిల్ 30) ఆయన గేట్ వే ఆఫ్ ఇండియాకు చేరుకోవాల్సి ఉంది.
తీవ్ర అస్వస్థతకు గురైన వినోద్‌ను వెంటనే స్థానిక రక్ష ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వినోద్ డీహైడ్రేషన్, లో బీపీ, గుండెలయలో తేడా, ఇతర సమస్యలతో బాధపడుతున్నాడని అతడిని పర్యవేక్షిస్తున్న డాక్టర్ ప్రణవ్ కబ్రా తెలిపారు. వినోద్ కనుక పూర్తిగా కోలుకుంటే మే 1 నుంచి ఆయన యాత్ర తిరిగి కొనసాగుతుందని వినోద్ అధికార ప్రతినిధి ఫ్లైన్ రెమిడోస్ పేర్కొన్నారు.
బీహార్‌లో ఓ దిగువ తరగతి కుటుంబంలో వినోద్ రెండు కాళ్లు లేకుండా జన్మించాడు. అయినా ఎప్పుడూ కాళ్లు లేవని బాధపడలేదు. 12వ తరగతి వరకు చదువుకున్నాడు. ఓ మొబైల్ రిపేరింగ్ షాప్‌లో పనిచేస్తున్నాడు. డ్యాన్స్‌లో దిట్ట. స్టంట్ మాస్టర్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. వీల్ చైర్‌లో ఉండే అద్భుతాలు చేసే వినోద్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. ఓ ఎన్జీవో నెవడా పుట్నాన్ ఫౌండేషన్‌తో కలిసి వీల్‌చైర్‌లో అత్యధిక దూరం ప్రయాణించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకోవాలనుకున్నాడు.