Tripura: ఆవుల్ని, పందుల్ని, కోళ్లను పెంచుకోండి.. అవి కూడా ఉద్యోగాలే!: త్రిపుర సీఎం ఉచిత సలహా
- వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న విప్లవ్ దేవ్
- ఉద్యోగాల కోసం తిరిగి కాలాన్ని వృథా చేసుకోవద్దని సూచన
- నిరుద్యోగులు ఆవుల్ని పెంచుకుని ఉంటే వారి తలరాతలు మారిపోయి ఉండేవని వ్యాఖ్య
వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేశారు. ఈసారి నిరుద్యోగులను టార్గెట్‌గా చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపై పడకుండా ఆవులను పెంచుకోవడమో, పాన్ షాపు పెట్టుకోవడమో చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం తిరిగి విలువైన సమయాన్ని వృథా చేసుకోవడం మాని ఈ పనిచేయాలని సూచించారు.
పాలు కనుక అమ్ముకుని ఉంటే ఇప్పటికే ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 లక్షల వరకు ఉండేవని అన్నారు. లీటరు పాలు రూ.50 అని, రూ.75 వేల పెట్టుబడితో కొంచెం కష్టపడితే నెలకు రూ. 25 వేల వరకు సంపాదించుకోవచ్చని అన్నారు. సర్కారు ఉద్యోగాల కోసం పదేళ్లపాటు కాళ్లరిగేలా తిరగడం కంటే ఇది బెటరని పేర్కొన్నారు.
ఆవుల్ని, పందుల్ని, కోళ్లను పెంచుకోవడం ద్వారా గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించవచ్చని పేర్కొన్నారు. త్రిపుర వెటర్నరీ కౌన్సిల్ ఆదివారం నిర్వహించిన ఓ సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గతంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ నిరుద్యోగులు పకోడీలు అమ్ముకోవడం ద్వారా ఉపాధి పొందాలని సూచించారు. ఇప్పుడు విప్లవ్ దేవ్ ఆవులు పెంచుకోమని, పాన్ షాపు పెట్టుకోమని పిలుపునిచ్చారు. సీఎం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.. రెండు రోజుల క్రితం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సివిల్స్ పరీక్షను సివిల్ ఇంజినీర్లే రాయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు మహాభారతంలో ఇంటర్నెట్ ఉందన్నారు.