Suravaram Sudhakar Reddy: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడోసారి సురవరం సుధాకర్‌రెడ్డి!
- ముగిసిన సీపీఐ 23వ జాతీయ మహాసభలు
- జాతీయ కౌన్సిల్ సభ్యులుగా 126 మంది నియామకం
- లౌకిక శక్తులు ఏకం కావాలని సురవరం పిలుపు
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్‌రెడ్డి (76) మూడోసారి ఎన్నికయ్యారు. కేరళలోని కొల్లంలో నిర్వహించిన ఆ పార్టీ 23వ జాతీయ మహాసభల్లో సుధాకర్ రెడ్డిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణకు చెందిన సుధాకర్ రెడ్డి నల్లగొండ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2012లో తొలిసారి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. సభల్లో 126 మందిని జాతీయ కౌన్సిల్ సభ్యులుగా, 11 మందిని సెక్రటేరియట్ సభ్యులుగా, 11 మందిని కంట్రోల్ మిషన్ సభ్యులుగా, 13 మందిని క్యాండిడేట్ సభ్యులుగా నియమించారు.
ఆదివారంతో ముగిసిన ఈ సభల్లో కొందరు సీనియర్లను తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించారు. ఢిల్లీ జేన్‌ఎన్‌టీయూ మాజీ విద్యార్థి కన్నయ్య కుమార్‌ను జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ ఆరెస్సెస్, బీజేపీలను ఎదుర్కొనేందుకు లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.