Kodandaram: మనమందరం కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది!: ప్రొ.కోదండరామ్
- ఎంతో మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు
- అమరవీరుల కుటుంబాలు ఎన్నో కష్టాల్లో ఉన్నాయి
- వారిని కూడా ఆదుకోవడం లేదు
- ప్రశ్నించిన వారిపై రౌడీషీటర్లుగా ముద్ర వేస్తున్నారు
ఈ రోజు తెలంగాణలో వస్తోన్న సంపద మూడు జిల్లాల నుంచే వస్తోందని, మరి మిగతా జిల్లాల సంగతి ఏంటని, వారికి ఉద్యోగాలు వద్దా? అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ ప్రశ్నించారు. సంపద వస్తోన్న మూడు జిల్లాల్లో కూడా సాధారణ ప్రజలు బాగుపడలేదని విమర్శించారు. ఈ రోజు హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో నిర్వహించిన తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్‌లో గుడిసెవాసులకు ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా కట్టివ్వలేదని అన్నారు.
ఎంతో మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారని, అమరవీరుల కుటుంబాలు ఎన్నో కష్టాల్లో ఉన్నాయని, వారిని కూడా ఆదుకోవడం లేదని కోదండరామ్ అన్నారు. ప్రశ్నించిన వారిపై రౌడీషీటర్లుగా ముద్ర వేసి కేసులు పెడుతున్నారని, తెలంగాణ జనసమితి విజయవంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. సొంత ఖర్చులతో ఇక్కడికి వచ్చారని, మనమందరం కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని అన్నారు. తమ పార్టీ ఎన్నికల్లో పోటీచేస్తే ఓట్లు చీలుతాయని కొందరు అంటున్నారని, అది నిజం కాదని అన్నారు. అందరం కలిసి నవతెలంగాణ నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.
నియంతృత్వం పాలన ఉంది: ప్రొ.హరగోపాల్
సభలు ఎన్ని గంటలు జరుపుకోవాలో కూడా సర్కారే నిర్ణయిస్తుందా? అని ఈ సభలో పాల్గొన్న ప్రొ.హరగోపాల్ అన్నారు. ఉద్యమపార్టీ కాబట్టి టీఆర్‌ఎస్ ప్రజాస్వామ్యయుతంగా నడుచుకుంటుందని అనుకున్నామని, పౌరహక్కుల సంఘాలు కూడా సమావేశం కాకుండా నియంతృత్వం సాగుతోందని అన్నారు. ప్రతి సభకు హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సి వస్తోందని, ఇదే పరిస్థితి ఉద్యమ సమయంలో ఉంటే టీఆర్ఎస్ బతికి ఉండేదా? అని ప్రశ్నించారు.