IRCTC: దోచేస్తున్న ఐఆర్సీటీసీ... ఆర్టీఐతో వెల్లడైన విస్తుపోయే వాస్తవం!

  • టికెట్ రద్దుపైనా సర్వీస్ చార్జ్
  • జూలై 1 నుంచి 11 రోజుల్లో రూ. 3 కోట్లకు పైగా సంపాదన
  • లోక్ అదాలత్ లో కేసు విచారణ

రైల్వే టికెట్లను బుక్ చేసుకోవడం, ఆపై ఏవో కారణాల వల్ల టికెట్ రద్దు చేసుకోవడం అత్యంత సర్వసాధారణం. అయితే, టికెట్ బుక్ రద్దు చేసుకునేటప్పుడు కూడా సర్వీస్ చార్జ్ విధిస్తున్న ఐఆర్సీటీసీ వెబ్ సైట్, 9 లక్షల మంది నుంచి సుమారు రూ. 3 కోట్లకు పైగానే వెనకేసుకుంది. తనకు రావాల్సిన రూ. 35 కోసం ఏడాదిగా ఐఆర్సీటీసీపై పోరాటం చేస్తున్న సుజిత్ స్వామి అనే యువకుడు సమాచార హక్కు చట్టాన్ని వినియోగిస్తూ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని ఐఆర్సీటీసీ వెల్లడించింది. తాను రూ. 765కు టికెట్ కొని, దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే రూ. 665 మాత్రమే చెల్లించారని ఆయన ఆరోపించాడు. తొలుత ఫిర్యాదు చేస్తే, రిఫండ్ చేస్తామని బదులిచ్చారని, కానీ అలా చేయలేదని ఆరోపిస్తూ, ఐఆర్సీటీసీకి లేఖ రాయగా, విస్తుపోయే నిజం వెల్లడైంది.

‘రైల్వే కమర్షియల్‌ సర్క్యులర్ 43’ కింద జీఎస్టీ అమలు కంటే ముందే టికెట్‌ బుక్‌ చేసుకున్నా, జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత టికెట్‌ రద్దు జరిగిందని, దీనిపై సర్వీస్‌ ఛార్జీలు వర్తిస్తాయని, అందువల్ల రిఫండ్‌ చెయ్యాల్సిన అవసరం లేదని సమాధానం ఇచ్చింది. ఇక జీఎస్టీ అమలులోకి వచ్చిన జూలై 1 నుంచి జూలై 11 మధ్య ప్రయాణానికి టికెట్ కొని దాన్ని రద్దు చేసుకున్న వారి నుంచి రూ. 3.34 కోట్ల సర్వీస్ చార్జ్ లను ఐఆర్సీసీటీసీ వసూలు చేసింది. చాలా మంది ప్రయాణికులు ఈ బాదుడు విషయం తెలియదని, కొందరికి తెలిసినా విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని సుజిత్ స్వామి వెల్లడించారు. దీనిపై లోక్‌ అదాలత్‌ ను సుజిత్‌ ఆశ్రయించగా, రైల్వే బోర్డుకు, పశ్చిమ మధ్య రైల్వేకు, ఐఆర్‌సీటీసీకి నోటీసులు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News