KCR: సీఎంగా కొనసాగుతూనే ఢిల్లీపై కన్నేసిన కేసీఆర్... వారసుడిగా కేటీఆర్!
- 2019 ఎన్నికల వరకూ కేసీఆరే సీఎం
- కేటీఆర్ కు అదనపు బాధ్యతలు
- నేడు తమిళనాడుకు కేసీఆర్
- తృతీయ కూటమి ఏర్పాటుపై వడివడిగా అడుగులు
జాతీయ రాజకీయాల్లో సత్తా చాటేలా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రంలో సీఎంగా కొనసాగుతూనే, ఢిల్లీపై కన్నేశారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే అవకాశం కోసం చూస్తున్న ఆయన రాష్ట్రంలో తన వారసుడిగా కుమారుడు, ప్రస్తుత ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీ రామారావును నిలపాలని భావిస్తూ, ఆయనకు మరిన్ని బాధ్యతలను అప్పగిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా కదులుతున్న ఆయన ఇప్పట్లో సీఎం పదవి నుంచి తప్పుకోబోరని సమాచారం. రెండు రోజుల క్రితం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటిస్తారన్న వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పటికిప్పుడు ఆ పని చేసేందుకు కేసీఆర్ అంగీకరించ లేదని సమాచారం.
2019 ఎన్నికల వరకూ సీఎంగా కేసీఆరే ఉంటారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈలోగా అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటించి, కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కాగా, ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, జేడీ-ఎస్ నేతలు దేవెగౌడ, కుమారస్వామి, జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్ తదితరులతో చర్చలు సాగించిన కేసీఆర్, నేడు చెన్నైకి వెళ్లి కరుణానిధి, స్టాలిన్ లతోనూ, మే నెల మొదటి వారంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తోనూ తృతీయ కూటమి ఏర్పాటుపై చర్చించనున్నారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ వచ్చే వారం హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ తో మాట్లాడనున్నారు.