China: అది నిజమే కావచ్చు కానీ.. చైనాకు అంత సీన్ లేదు: మలేసియా ప్రధాని నజీబ్
- ఆసియాలో చైనా అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుంది
- అమెరికా మిలటరీతో మాత్రం పోటీ పడలేదు
- వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో మళ్లీ మాదే అధికారం
ఆసియాలో చైనా అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉంది కానీ, అమెరికా మిలటరీతో ఎప్పుడూ పోటీ పడలేదని మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ తేల్చి చెప్పారు. ‘బ్లూమ్‌బర్గ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చైనా, అమెరికాలతో మలేసియాకు ఉన్న బంధాన్ని వివరించారు. ‘తుసిడిడెస్ ట్రాప్’(ఒక అగ్రరాజ్యాన్ని మరో అగ్రరాజ్యంగా ఎదుగుతున్న దేశం సవాల్ చేస్తున్న సందర్భంలో నెలకొనే యుద్ధవాతావరణం- గ్రీక్ చరిత్రకారుడు తుసిడిడెస్ ప్రతిపాదించడంతో ఆయన పేరిట ఏర్పడిన పదం) లోకి వెళ్లిపోకుండా ఈ రెండు దేశాలు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని నజీబ్ అభిప్రాయపడ్డారు.
తామెప్పుడూ సోకాల్డ్ రైజింగ్ పవర్‌గా ఉండాలనుకోవడం లేదని పేర్కొన్న ఆయన, చైనా అతిపెద్ద ఆర్థిక శక్తి కాగలదన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదన్నారు. అయితే, అమెరికా మిలటరీ సూపర్ పవర్‌తో మాత్రం పోటీపడలేదని కుండబద్దలుగొట్టారు. వచ్చే నెల 9న మలేసియాలో జరగనున్న ఎన్నికల్లో మరోమారు విజయం సాధించి అధికారంలోకి వస్తామని నజీబ్ (64) ధీమా వ్యక్తం చేశారు.