Renuka choudary: దుమారం రేపుతున్న రేణుకా చౌదరి క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలు.. మండిపడిన శివసేన

  • రేణుక వ్యాఖ్యలు మహిళలకే అవమానం
  • దేవాలయం లాంటి పార్లమెంటుపై ఇటువంటి వ్యాఖ్యలా?
  • మరి ఎంపీగా ఉన్నప్పుడు ఆమేం చేశారో?

క్యాస్టింగ్‌ కౌచ్‌పై కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు మహిళలకే అవమానమని శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతా రాహిత్యంతో కూడుకున్నవని, దేశంలోని మహిళలందరినీ ఆమె అవమానించారని పేర్కొంది. రేణుకా చౌదరి క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలను శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో ప్రస్తావిస్తూ ఈ విధంగా మండిపడింది.

రేణుక ఎంపీగా ఉన్న కాలంలో క్యాస్టింగ్ కౌచ్‌పై ఎందుకు స్పందించలేదని నిలదీసింది. ఆమె వ్యాఖ్యల్లో నిజానిజాలను పక్కనపెడితే ఈ విషయంపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. క్యాస్టింగ్ కౌచ్ ఉందని తేలితే, అది ఎప్పటి నుంచి సాగుతుందో కూడా విచారణ జరిపించాలని శివసేన డిమాండ్ చేసింది. దేవాలయం లాంటి పార్లమెంట్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు కించపరిచేలా ఉన్నాయని ధ్వజమెత్తింది.

ప్రస్తుతం టాలీవుడ్‌ను ఊపేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ దుమారంపై రేణుకా చౌదరి ఇటీవల మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ ఒక్క సినిమా రంగానికే పరిమితం కాలేదని, మహిళలు పనిచేసే ప్రతీ ప్రాంతంలోనూ ఇది ఉందని, చివరికి పార్లమెంటు కూడా క్యాస్టింగ్ కౌచ్‌కు అతీతం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News