Telangana: తెలంగాణలో ఎవరు బాగుపడ్డా మాకు సంతోషమే : సీఎం కేసీఆర్
- కొందరు వ్యతిరేక వార్తలతో తప్పుడు ప్రచారం చేశారు
- కాంగ్రెస్ రాజ్యంలో వాడకో పేకాట క్లబ్ ఉండేది
- విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ఎన్నడూ వివక్ష చూపలేదు
తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. హైదరాబాద్ శివారు కొంపల్లిలో టీఆర్ఎస్ 17వ ప్లీనరీలో ముగింపు ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, కొందరు వ్యతిరేక వార్తలతో తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ రాజ్యంలో వాడకో పేకాట క్లబ్ ఉండేదని, ఆ క్లబ్ లను మూసి వేయించామని, తెలంగాణలో గుడుంబాను నిర్మూలించామని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో నిష్పక్షపాతంగా ఉన్నామని, విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై తాము ఎన్నడూ వివక్ష చూపలేదని, తెలంగాణలో ఎవరు బాగుపడ్డా తమకు సంతోషమేనని అన్నారు.
మరో 60 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు చేస్తాం
'తెలంగాణ కంటి వెలుగు' కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ తర్వాత తేదీలు ప్రకటిస్తామని, తెలంగాణ స్టేట్ హెల్త్ ప్రొఫైల్ కింద ప్రతి వ్యక్తికి హెల్త్ చెకప్ నిర్వహిస్తున్నామని, తెలంగాణ వ్యాప్తంగా 40 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, మరో 60 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. చేనేత, గీత కార్మికులకు అనేక రాయితీలు ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో ధనికులైన యాదవులకు చిరునామాగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని అన్నారు.
ఆకుపచ్చ ‘తెలంగాణ’ మన లక్ష్యం
తెలంగాణలో కోటి ఎకరాలలో నీరు పారిస్తామని, ఆకుపచ్చ ‘తెలంగాణ’ మన లక్ష్యమని, ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఇరిగేషన్ కు రూ.37,500 కోట్లు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పనులను మంత్రి హరీశ్ రావు పరుగులు పెట్టిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ తో ప్రజలు సంతోషంగా ఉన్నారని, భూగర్భ జలాలు ఎక్కడా అడుగంటిపోలేదని చెప్పారు.
ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించాలని ఈ సందర్భంగా రైతులకు కేసీఆర్ సూచించారు. మిషన్ భగీరథ 95 శాతం పూర్తయిందని, ఇంట్రా విలేజ్ పనులు పూర్తి కావాల్సి ఉందని, జులై నాటికి ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీరిస్తామని, హైదరాబాద్ నగరంలో నీరు, విద్యుత్ సమస్య లేదని అన్నారు. విప్లవాత్మకంగా భూరికార్డుల ప్రక్షాళన చేశామని, ఇకపై రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే రోజు జరుగుతాయని..లంచాలు ఇవ్వకుండా, కార్యాలయాల చుట్టూ తిరగకుండా పట్టాదారు పాస్ బుక్ కొరియర్ లో ఇంటికి పంపిస్తామని చెప్పారు. మే 10 నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు.
మత్స్యకారులకు మరబోట్లు అందజేస్తాం
రిజర్వాయర్లలో చేపలు పట్టేందుకు మత్స్యకారులకు మరబోట్లు అందజేస్తామని, మరబోట్ల పంపిణీకి రూ.1000 కోట్లు కేటాయిస్తామని కేసీఆర్ చెప్పారు.