Chandrababu: చంద్రబాబు తనకు ప్రాణభయముందని చెప్పడం సిగ్గుచేటు!: సి.రామచంద్రయ్య
- నిత్యం కేంద్రంపై పోరాడే మమతా బెనర్జీ ప్రాణభయం లేకుండా హాయిగా ఉన్నారు!
- అలాంటిది, మీకు ప్రాణభయమేంటి చంద్రబాబుగారు?
- చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలి?
- ఇది సానుభూతి కోసమో, రాజకీయ ఎత్తుగడో చెప్పాలి?
నిత్యం కేంద్రంపై పోరాడే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రాణభయం లేకుండా హాయిగా ఉన్నారని, అలాంటిది, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనకు ప్రాణభయం ఉందని చెప్పడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని కాపాడే ముఖ్యమంత్రే ఇలా భయపడుతుంటే..ఇక ప్రజలను ఎలా కాపాడతారని ప్రశ్నించారు.
అసలు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని, బాబు చేసిన అక్రమాలు అరాచకాలే ఆయనకు ముప్పును తెస్తాయని విమర్శించారు. చంద్రబాబుకు ప్రజలు తమ ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేయడమే పాపమని అన్నారు. చంద్రబాబుపై తనకు వ్యక్తిగతంగా ఏమీ లేదని, చాలా ఏళ్లుగా తనకు మంచి స్నేహితుడని అన్నారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని.. అయితే, ఎందుకు భయపడుతున్నారు? దేని గురించి భయపడుతున్నారు? ఎందుకు, ఆవిధంగా మాట్లాడుతున్నారు? ప్రజలు ఏవిధంగా మిమ్మల్ని కాపాడగలుగుతారు?’ అని ప్రశ్నించారు.
‘అంత సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ఆవిధంగా మాట్లాడుతున్నారంటే..కేవలం, ప్రజల నుంచి సానుభూతి సంపాదించుకునేందుకేనా లేక ఏమైనా నిజముందా? ఇది సానుభూతి కోసమో, రాజకీయ ఎత్తుగడో చెప్పాల్సిన అవసరం నీకు (చంద్రబాబు)కు ఉంది! చంద్రబాబు నాయుడు గారూ! ప్రజలు సర్వప్రభువులు.. వాళ్లకు అన్ని హక్కులూ ఉన్నాయి. ఏదో ఒకటి చెప్పేసి తుడుచుకుని పోదామంటే కాదు! మీ బాధ్యతలు మీరు గుర్తెరగాలి, ప్రజలపై మీ బాధ్యతలేంటో తెలుసుకోవాలి!
ఎందుకంటే, ప్రజల మిమ్మల్నిఎన్నుకున్నారు. మీరు సీఎం కాకపోతే, మిమ్మల్ని అడగాల్సిన అవసరమే లేదు! ఆ భయం ఏంటో చెప్పాల్సిన అవసరం మీకు ఉంది. లేకపోతే, మీ హోం మినిస్టర్ ని, డీజీపీని చెప్పమనండి!..ఏమి అక్రమాలు, అరాచకాలు చేశారు?మీపైన ఎవరు కసి పెంచుకున్నారు? నిజంగా, నువ్వు (చంద్రబాబు) తప్పులు చేసుంటే పనిష్ మెంట్ తప్పదు! నిజంగా, ప్రాణభయం ఉంటే చెప్పండి..బీసీలు పనికిరారు, ముస్లింలు పనికిరారు! నువ్వొక్కడివే పనికొస్తావా? సారీ, నాకు ..‘నువ్వు’ అనేదే వస్తోంది..గౌరవంగా ముఖ్యమంత్రిగారనే అంటాను’ అని అన్నారు.