Chandrababu: అసలు, మోదీ ఇచ్చిన హామీలు చంద్రబాబు కు గుర్తున్నాయా?: సి. రామచంద్రయ్య
- హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని చంద్రబాబు పరామర్శించారా?
- చంద్రబాబు ఇంకా ఎన్ని యూ టర్న్ లు తీసుకుంటారు?
- ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి
నాడు తిరుపతిలో చంద్రబాబు, మోదీ కలిసి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రజలకు మాటిచ్చారని, వాటిని మళ్లీ గుర్తుచేసేందుకు ఇప్పుడు సభ పెడతాననని చంద్రబాబు అనడం హాస్యాస్పదమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామచంద్రయ్య అన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అసలు, మోదీ ఇచ్చిన హామీలు చంద్రబాబు కు గుర్తున్నాయా? హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని చంద్రబాబు ఎప్పుడైనా పరామర్శించారా? అని ప్రశ్నలు సంధించారు.
హోదాకు బదులు ప్యాకేజీని స్వాగతించిన చంద్రబాబు ఇంకా ఎన్ని యూ టర్న్ లు తీసుకుంటారని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు 50 శాతం ఓట్లు కూడా రాలేదని, ఇటీవల చేసిన ధర్మ పోరాట దీక్ష అట్టర్ ప్లాప్ అయిందని, ఈ దీక్ష వల్ల చంద్రబాబు ఏం సాధించారు? అని అన్నారు. చంద్రబాబుకు నైతిక విలవలుంటే ‘హోదా’ విషయంలో తప్పు చేశానని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒకప్పుడు చంద్రబాబు కు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండేదని, ‘హోదా’ వల్ల ఇప్పుడు చంద్రబాబు లాఫింగ్ స్టార్ అయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గవర్నర్ వ్యవస్థ పైన చంద్రబాబు స్టాండ్ ఏంటో చెప్పాలని, జస్టిస్ ఈశ్వరయ్య సామాన్య వ్యక్తి కాదని, బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఈశ్వరయ్య రాసిన లేఖకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలకు భిన్నంగా చంద్రబాబు పనిచేస్తున్నారని, నామినేటెడ్ పోస్టులన్నీ 80 శాతం అగ్రకులాలకే కట్టబెడుతున్నారని రామచంద్రయ్య ఆరోపించారు.