KCR: హైదరాబాద్ కేంద్రంగానే భూకంపం పుట్టిస్తా: కేసీఆర్

  • బీజేపీ, కాంగ్రెస్ ల వల్ల ఉపయోగం లేదు
  • దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తా
  • రాజకీయాల్లో సమూలమైన మార్పులు తీసుకొస్తా

దేశ రాజకీయాలపై తాను చేసిన ప్రకటనతో ప్రకంపనలు పుట్టాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తాను ఎవ్వరికీ భయపడనని... దేశ బాగు కోసం తాను పోరాడతానని చెప్పారు. దేశ రాజకీయాలపై మాట్లాడితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనను బీజేపీ ఏజెంట్ అంటూ విమర్శించారని అన్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు కేసీఆర్ అంటే ఎందుకంత భయం? అని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు డ్రామా ఆడుతున్నాయని... వాటి అసమర్థత వల్లే నీటి యుద్ధాలు వస్తున్నాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలో 70 వేల టీఎంసీల నీరు ఉందని... సాగుభూమి 40 కోట్ల ఎకరాలు మాత్రమేనని... 40 వేల టీఎంసీలతో ప్రతి ఎకరాకు నీటిని ఇవ్వచ్చని కేసీఆర్ చెప్పారు. నీటి వివాదాలను ట్రైబ్యునళ్లు తాత్సారం చేస్తుండటంతో... రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు జరుగుతున్నాయని విమర్శించారు. 40 కోట్ల ఎకరాలకు నీటిని ఇచ్చే పథకాలను రూపొందిస్తామని, ఫెడరల్ స్పూర్తితో రైతాంగ సమస్యలపై పోరాడతామని చెప్పారు. అంతర్జాతీయ టూరిజంను అభివృద్ధి చేయడం లేదని, రైల్వే వ్యవస్థ అద్వానంగా ఉందని, ఎయిర్ పోర్టులు, పోర్టులు దారుణంగా ఉన్నాయని అన్నారు. ఈ పార్టీల నాయకత్వాన్ని నమ్ముకుంటే దేశం బాగుపడదని చెప్పారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ వల్ల ఎంతో మంది జవాన్లు చనిపోతున్నారని... ఇంటర్నేషనల్ డిప్లమసిలో కేంద్రం తెలివితేటలు చూపకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని విమర్శించారు.

దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేస్తానని... గుణాత్మకమైన మార్పుకు శ్రీకారం చుడతానని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగానే భూకంపం పుట్టిస్తానని, దేశ రాజకీయాల్లో సమూలమైన మార్పులు తీసుకొస్తానని అన్నారు.

KCR
  • Loading...

More Telugu News