telomerase: 20 ఏళ్ల కృషి ఫలించింది.. ఇక ఎప్పటికీ యంగ్ గానే ఉండొచ్చు!

  • నిత్యయవ్వనంగా ఉంచే ఎంజైమ్ టెలోమెరాసే
  • దీన్ని సమస్థితిలో ఉంచగలిగితే ఎప్పటికీ యంగ్ గానే ఉండొచ్చు
  • క్యాన్సర్ కు గురయ్యే అవకాశం కూడా ఉండకపోవచ్చు

మనుషులు, జంతువులు, మొక్కల్లో జీవకణాలను పునరుజ్జీవింపజేసే ఎంజైమ్ గుట్టును శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దాదాపు రెండు దశాబ్దాల కృషి అనంతరం నిత్య యవ్వనాన్ని ప్రసాదించే ఎంజైమ్ తీరుతెన్నులను కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విచిత్ర ఎంజైమ్ పేరు 'టెలోమెరాసే'. దీని స్థాయులు తగ్గితే జీవకణాలు వేగంగా చనిపోతాయి. ఇది ఎక్కువైనా ప్రమాదమే. ఒకవేళ ఈ ఎంజైమ్ ఎక్కువైతే కణ విభజన విపరీతంగా జరుగుతూ క్యాన్సర్, జన్యుకారక వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది.

1970ల్లోనే అమెరికా-ఆస్ట్రేలియా పరిశోధకురాలు ఎలిజబెత్ బ్లాక్ బర్న్ ఈ ఎంజైమ్ ను కనుగొన్నారు. అప్పటి వరకు ఇదొకటి ఉందనే విషయం కూడా ఎవరికీ తెలియదు. దీనికిగాను 2009లో ఆమెకు నోబెల్ బహుమతి దక్కింది. టెలోమెరాసేపై లోతుగా అధ్యయనం చేస్తున్న కేథలీన్ కొలిన్స్ టీమ్ కు... దీనికి సంబంధించిన కొన్ని రహస్యాలు లభించాయి.

ఈ రసాయనానికి సంబంధించిన తీరుతెన్నులు, నిర్మాణం, ప్రభావాలను వారు గుర్తించారు. కొన్ని ఔషధాల ద్వారా ఈ ఎంజైమ్ ను సమస్థితిలో ఉంచగలిగితే... ఎప్పటికీ నిత్యయవ్వనంగానే ఉండవచ్చని కొలిన్స్ తెలిపారు. అంతేకాదు, క్యాన్సర్ కు గురయ్యే అవకాశం కూడా ఉండకపోవచ్చని చెప్పారు. దీనికి సంబంధించిన కథనాన్ని 'జర్నల్ నేచర్' ప్రచురించింది. 

  • Loading...

More Telugu News