Rahul Gandhi: విమానంలో అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణికిపోతున్న వేళ... నిబ్బరంగా రాహుల్ గాంధీ!

  • 40 నిమిషాల పాటు తీవ్ర ఉత్కంఠ
  • విమానంలోని వారిలో తీవ్ర ఆందోళన
  • ప్రశాంతంగా కూర్చున్న రాహుల్
  • వెల్లడించిన కౌశల్ విద్యార్థి

అదో చిన్న విమానం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ, తన టీమ్ తో సహా వెళుతున్న వేళ.. ఒక్కసారిగా కుదుపులు. ఓ వైపు ఒరిగిపోయి అలాగే కిందకు జారుతోంది. భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. పైలెట్లు కష్టం మీద విమానాన్ని నడుపుతూ మెల్లిగా ఎయిర్ పోర్టు వైపు తీసుకు వస్తున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ఏం జరుగుతుందోనని తీవ్ర ఉత్కంఠ. విమానాన్ని ల్యాండింగ్ చేయాలని చేసిన తొలి ప్రయత్నం విఫలం. రెండోసారీ అదే ఫలితం. అసలు విమానం క్షేమంగా ల్యాండ్ అవుతుందా? అని హుబ్లీ ఎయిర్ పోర్టు అధికారుల్లో తీవ్ర ఆందోళన. మూడోసారి విమానం క్షేమంగా దిగింది.

నిన్న రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలోనే ఉన్న ఆయన అనుచరుడు కౌశల్ విద్యార్థి ఈ ఆందోళనకర పరిస్థితిని తలచుకున్నారు. తన జీవితంలోనే ఇది అత్యంత భయంకరమైన రోజుగా అభివర్ణించిన ఆయన, విమానంలోని వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతున్న వేళ, రాహుల్ గాంధీ, ప్రశాంతచిత్తంతో కూర్చుని ఉన్నారని, ఆయనలో ఎటువంటి ఆందోళనా కనిపించలేదని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల మధ్య ఉన్నామని తెలిసి కూడా ఆయన నిబ్బరంగా ఉన్నారని అన్నారు. విమానంలో సమస్య కావాలనే సృష్టించి ఉండవచ్చన్న అనుమానం తలెత్తిందని, దీనిపై సమగ్రంగా విచారించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక డీజీపీ ఎన్ నీల్ మణి రాజుకు కౌశల్ లేఖను రాశారు. కాగా, విమానం ల్యాండ్ అయిన తరువాత తన షెడ్యూల్ లో ఉన్న ఎన్నికల ప్రచారానికి రాహుల్ వెళ్లిపోయారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News