Hyderabad: హైదరాబాద్ కు ఓ 'పాలికా బజార్'... సాలార్ జంగ్ మ్యూజియం నుంచి స్టేట్ లైబ్రరీ వరకూ!

  • మూసీ నదిపై ఐకానిక్ బ్రిడ్జ్
  • చార్మినార్ వద్ద దుకాణాలు కోల్పోయే చిరు వ్యాపారుల కోసమే
  • కేవలం పాదచారులకు మాత్రమే అనుమతి
  • రూ. 120 కోట్లతో ఏడాదిలో నిర్మాణం

న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో ఉండే పాలికా బజార్ తరహాలో హైదరాబాద్ లో మూసీనదికి ఇరువైపులా సాలార్ జంగ్ మ్యూజియం నుంచి స్టేట్ లైబ్రరీ వరకూ ప్రజా మార్కెట్ ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ నదిపై ఓ ఐకానిక్ బ్రిడ్జ్, దాని మధ్యలో క్లాక్ టవర్ ను నిర్మించి, పైన రెండు వైపులా రకరకాల దుకాణాలు, సేద తీరేందుకు బెంచీలు, బృందాలుగా విడిపోయి వినాదాలు చేసుకోవాలని చూసే వారికి తగినంత స్థలం, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పాతబస్తీకి, కొత్త నగరానికీ మధ్య అద్భుతమైన వంతెనను నిర్మించడం ద్వారా పర్యాటకులను మరింత మందిని ఆకర్షించాలని, ఎలాంటి వాహనాలకూ అనుమతించకుండా, కేవలం పాదచారుల కోసమే ఈ ప్రాజెక్టు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చార్మినార్ పాదచారుల పథకంలో భాగంగా ఉపాధిని కోల్పోతున్న చిరు వ్యాపారులకు ఇక్కడ తొలి ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ వంతెనను 200 మీటర్ల పొడవు, 72 మీటర్ల వెడల్పుతో నిర్మించాలని, వివిధ వరుసల్లో 25/25 సైజులో చిరు వ్యాపారులకు దుకాణాలు ఏర్పాటు చేస్తామని, వర్షం వస్తే తలదాచుకోవడానికి మూడు షెల్టర్లు, రిక్రియేషన్ జోన్ ఉంటాయని, దీని అంచనా వ్యయం రూ. 120 కోట్లని హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఆర్‌ డీసీఎల్‌) చీఫ్‌ ఇంజనీర్‌ మోహన్‌ నాయక్‌ వెల్లడించారు. పనులు ప్రారంభించిన తరువాత ఏడాదిలోగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని అన్నారు. ఢిల్లీలోని పాలికా బజార్ షాపింగ్ సెంటర్ అండర్ గ్రౌండ్ లో ఉంటే, ఇక్కడ మాత్రం షాపింగ్ సెంటర్ భూమిపై నిర్మితమయ్యే వంతెనపై ఉంటుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News