ttd: టీటీడీ బోర్డు సభ్యురాలి పదవి నుంచి ఎమ్మెల్యే అనిత తొలగింపు!
- ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
- నేను ‘క్రిస్టియన్’ అన్న అనిత ఇంటర్వ్యూ వీడియోను పరిశీలించిన అధికారులు
- ఈ మేరకు నివేదిక ఆధారంగా చర్యలు
టీడీపీ ఎమ్మెల్యే అనితను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి (బోర్డు) సభ్యురాలుగా ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. అయితే, ఆమె నియామకంపై పలు అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఆ పదవి నుంచి ఆమెను తొలగిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. తాను క్రిస్టియన్ నంటూ అనిత చెప్పిన ఓ ఇంటర్వ్యూ వీడియోను పరిశీలించిన అనంతరం, దీనిపై ఓ నివేదిక కావాలని సంబంధిత అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన నివేదిక అందడంతో ఏపీ ప్రభుత్వం ఆమెపై చర్యలు తీసుకుంది.
ఇదిలా ఉండగా, టీటీడీ సభ్యురాలిగా తనను నియమించడంపై కొందరు చేస్తున్న వివాదాల నేపథ్యంలో ఆ పదవి నుంచి తనను తప్పించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు అనిత ఇటీవల ఓ లేఖ రాశారు. తాను హిందువునే అని, ఎస్సీ కులస్తురాలినని పేర్కొన్న అనిత, తన ఇష్ట దైవానికి సేవ చేసే భాగ్యం కలిగిందని సంతోషపడ్డాను కానీ, కొందరు చేస్తున్న వివాదాల కారణంగా ఆవేదనకు గురయ్యానని ఆ లేఖలో ఆమె వాపోయింది. ఈ వివాదాల వల్ల చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే టీటీడీ బోర్డు సభ్యురాలి పదవి నుంచి తనను తప్పించాలని అనిత కోరారు.