Pakistan: ఇస్లామాబాద్ లో పాకిస్థానీ మృతికి కారణమైన అమెరికా దౌత్యాధికారి... పాక్ నిర్ణయంతో తీవ్ర కలకలం!
- పాక్ లో యాక్సిడెంట్ చేసిన దౌత్యాధికారి
- దౌత్య రక్షణ ఉన్నప్పటికీ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు
- తీవ్రంగా ఖండించిన అమెరికన్ ఎంబసీ
ఇస్లామాబాద్ లో తన వాహనాన్ని స్వయంగా నడుపుకుంటూ వెళ్లి యాక్సిడెంట్ చేసి మోటార్ సైకిల్ పై వెళుతున్న ఓ వ్యక్తి మృతికి కారకుడయ్యారన్న ఆరోపణలతో యూఎస్ దౌత్యాధికారిని దేశం విడిచి వెళ్లకుండా పాకిస్థాన్ నిషేధించడంతో కలకలం రేగుతోంది. ఇప్పటికే రెండు దేశాల మధ్యా అంతంతమాత్రంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా దిగజారాయి. యూఎస్ సైన్యానికి అటాచ్ అయిన ఈ దౌత్యాధికారి, ఓ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడ్డా ఆగకుండా వెళ్లి యాక్సిడెంట్ చేశారు.
ఈ ఘటనలో అతీక్ బేష్ (22) మరణించగా, అమెరికన్ డిప్లొమాట్ కల్నల్ జోసెఫ్ ఇమ్మానుయేల్ హాల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఇస్లామాబాద్ హైకోర్టు ముందు హాజరు పరిచారు. ఈ ఘటనపై అమెరికా తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసింది. సదరు అధికారికి దౌత్యపరమైన రక్షణ ఉంటే, నిబంధనలను అతిక్రమించి అరెస్ట్ ఎలా చేస్తారని, ఎలా విచారిస్తారని ప్రశ్నించింది.
కాగా, ఆ సమయంలో హాల్ మద్యం తాగి ఉన్నాడని పాక్ పత్రికలు ప్రకటించగా, దాన్ని యూఎస్ ఎంబసీ ఖండించింది. ప్రస్తుతం ఆయన ఎంబసీ కార్యాలయంలోనే ఉన్నారని స్పష్టం చేసింది. దౌత్యపరమైన రక్షణ ఉన్న ఆయన్ను విచారించే హక్కు తమకు లేదని అంగీకరించిన పాక్ డిప్యూటీ అటార్నీ జనరల్ రాజా ఖలీద్ మెహమూద్, ఆయన దేశం విడిచి వెళ్లకుండా బ్లాక్ లిస్టులో పెట్టామని తెలిపారు.