virat kohli: కోహ్లీని ఈ సారి అయినా అదృష్టం వరించేనా...? రాజీవ్ గాంధీ ఖేల్ రత్నకు ఆయన పేరు ప్రతిపాదన
- ధ్యాన్ చంద్ అవార్డుకు గవాస్కర్ పేరు
- ద్రోణాచార్య అవార్డుకు ద్రవిడ్ పేరు
- సిఫారసు చేసిన బీసీసీఐ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరును క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్నకు బీసీసీఐ సిఫారసు చేసింది. అలాగే, జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పేరును ద్రోణాచార్య అవార్డుకు ప్రతిపాదించింది. సునీల్ గవాస్కర్ ను ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుకు సిఫారసు చేసింది. పలు కేటగిరీలకు గాను చాలా వరకు నామినేషన్లను పంపినట్టు బీసీసీఐ ధ్రువీకరించింది.
ఇక శిఖర్ ధావన్, స్మృతి మంధన పేర్లను అర్జున అవార్డుల కోసం నిన్న సిఫారసు చేసిన విషయం తెలిసిదే. నిజానికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కోసం కోహ్లీ పేరును బీసీసీఐ సూచించడం ఇది రెండోసారి. 2016లోనూ కోహ్లీ పేరును సిఫారసు చేసినప్పటికీ ఆ ఏడాది అవార్డు మరొకరికి లభించింది. ఒకవేళ ఈ ఏడాది కోహ్లీని అదృష్టం వరిస్తే సచిన్, ధోని తర్వాత ఈ అవార్డు అందుకున్న మూడో క్రికెటర్ కోహ్లీయే అవుతాడు.