Hyderabad: మద్యం మత్తులో యువకుల సాయంతో కారెక్కిన ఈశాన్య రెడ్డి ఫ్రెండ్స్... సీసీటీవీలు చూసి బార్ ను సీజ్ చేసిన పోలీసులు!

  • ఆదివారం నాడు కారు ప్రమాదం
  • అంతకు పది నిమిషాల ముందు మద్యం తాగిన అమ్మాయిలు
  • 21 సంవత్సరాలు దాటినట్టు నకిలీ ధ్రువపత్రాల సృష్టి

ఆదివారం నాడు హైదరాబాద్, కుషాయిగూడ ప్రాంతంలో కారును వేగంగా నడిపి ఒక వ్యక్తి మరణానికి కారణమైన కేసును విచారిస్తున్న పోలీసులు, మైనర్లయిన వారికి మద్యం సరఫరా చేసిన ఏఎస్ రావు నగర్ లోని 'ఆఫ్ ది రూప్ టాప్ లాంజ్' బార్ ను సీజ్ చేశారు. పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఈ నలుగురు అమ్మాయిలు తమ వయసు 21 సంవత్సరాలు దాటినట్టుగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలను బార్ ఉద్యోగులకు చూపి మద్యం కొనుగోలు చేశారని మేడ్చల్‌ జిల్లా ఎక్సైజ్‌ సూపరిండెంటెంట్‌ ప్రదీప్‌రావు తన విచారణలో తేల్చారు. బార్ లోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన తరువాత, వారికి మద్యం సరఫరా చేసిన బార్ సిబ్బందిని అరెస్ట్ చేశారు. బార్ లైసెన్స్ ను పర్మినెంట్ గా రద్దు చేయాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు.

ఇక బార్ బయట ఉన్న కెమెరాలను పరిశీలించగా, ఈ అమ్మాయిలు పూటుగా తాగి, నడవలేని స్థితిలో ఉండగా, కొందరు యువకులు వారిని కారు వద్దకు చేర్చినట్టు కనిపిస్తోంది. వీరు కారు ఎక్కి వెళ్లిన పది నిమిషాల్లోనే ప్రమాదం జరిగిందని కూడా పోలీసులు గుర్తించారు. విద్యార్థినుల ఆధార్ కార్డులను పరిశీలించిన మీదట వారి వయసు 19 సంవత్సరాల్లోపే ఉందని తేల్చిన పోలీసులు, మద్యం కోసం నకిలీ గుర్తింపు కార్డులను వారు సృష్టించుకున్నారని తేల్చారు.

బార్ లో సమయపాలన లేదని కూడా విచారణలో తేలింది. ఇదిలావుండగా, తాము మాత్రం వారి వయసు 21 సంవత్సరాలు దాటాయని నిర్ధారించుకున్న తరువాతే సర్వీస్ అందించినట్టు బార్ యాజమాన్యం తెలిపింది. కాగా, ఈ కేసులో కారు నడిపిన ఈశాన్యరెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News