Tamilnadu: మోసపోయిన వారిలో నేను కూడా ఉన్నాను: నిర్మలాదేవి
- అమ్మాయిలను ఏమార్చాలని చూసిన నిర్మలాదేవి
- కుమార్తెకు మెడికల్ సీటు కోసం రూ. 30 లక్షలిచ్చి మోసపోయిన వైనం
- ఆ డబ్బును తిరిగి సంపాదించుకోవాలనే అమ్మాయిల ఎర
తమిళనాడులో సంచలనం కలిగిస్తున్న అరుప్పుకోట్టై దేవాంగరై ఆర్ట్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి కేసులో పోలీసులు మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చారు. తన పబ్బం గడుపుకోవడానికి కాలేజీలో చదివే అమ్మాయిలను ఏమార్చి పెద్దల వద్దకు పంపాలని నిర్ణయించుకున్న ఆమె, విద్యార్థినులతో జరిపిన ఫోన్ సంభాషణలు వెలుగులోకి రావడంతో కేసును సీబీసీఐడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తన కుమార్తెకు మెడికల్ సీటును పొందేందుకు రూ. 30 లక్షలు ఇచ్చి తాను మోసపోయానని అధికారుల విచారణలో నిర్మలాదేవి వెల్లడించినట్టు తెలుస్తోంది.
తాను మోసపోయిన డబ్బును ఎలాగైనా తిరిగి సంపాదించుకోవాలన్న ఉద్దేశంతోనే ఆమె అమ్మాయిలను ఎర వేసేందుకు ప్రయత్నించినట్టు సీబీసీఐడీ పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో కాలేజీలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు, మరో ఇద్దరు ప్రొఫెసర్లనూ ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మధురై కామరాజర్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలావుండగా, కేసు విచారణ సక్రమంగా జరగడం లేదని, కేసును దారి మళ్లించేలా సీబీసీఐడీ వ్యవహరిస్తోందని కామరాజర్ వర్శిటీ ప్రొఫెసర్లలో ఓ వర్గం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.