Donald Trump: అసలు కిమ్ జాంగ్ ఉన్ అంత మంచోడే లేడట.. తెగ పొగిడేస్తున్న ట్రంప్!

  • నార్త్ కొరియాపై మారిన అమెరికా స్వరం
  • త్వరలోనే కిమ్‌తో సమావేశం కానున్న ట్రంప్
  • ట్రంప్ వ్యాఖ్యలతో ఆశ్చర్యపోతున్న ప్రపంచం

నార్త్ కొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్‌పై నిన్నమొన్నటి వరకు కారాలు మిరియాలు నూరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా స్వరం మార్చారు. ప్రపంచంలో ఆయనంత గౌరవప్రదమైన వ్యక్తే లేడంటూ ఆకాశానికెత్తేశారు. త్వరలోనే ఆయనను కలుస్తానని చెప్పుకొచ్చారు.

కిమ్‌పై గతేడాది ట్రంప్ నిప్పులు చెరిగారు. ‘లిటిల్ రాకెట్ మ్యాన్’ అంటూ అపహాస్యం చేశారు. నార్త్ కొరియాపై సైనిక చర్య తప్పదని హెచ్చరించారు. మరోసారి రెచ్చగొడితే ప్రపంచపటం నుంచి ఆ దేశాన్ని తుడిచిపెట్టేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ట్రంప్ హెచ్చరికలకు కిమ్ కూడా అంతే దీటుగా బదులిచ్చారు. ట్రంప్ మానసిక స్థిమితం కోల్పోయారని, అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. అంతేకాదు.. తాము కూడా అమెరికాను బుగ్గి చేయగలమని హెచ్చరించారు.

అయితే, అమెరికా స్వరంలో ఒక్కసారిగా మార్పు రావడం నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. ‘‘మేమిద్దరం కలుసుకుంటామని ఇప్పటికే నేరుగా చెప్పాం. వీలైనంత త్వరలోనే మేం కలుసుకోబోతున్నాం’’ అని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు, ప్రపంచానికి ఇది గొప్ప విషయమని పేర్కొన్నారు. ‘‘అతడు (కిమ్) నిజంగా చాలా మంచోడు. గౌరవప్రదమైన వ్యక్తి. నేనిప్పటి వరకు అతడిని గమనించిన దానిని బట్టి అతడు చాలా ఓపెన్ మైండెడ్’’ అని ట్రంప్ పేర్కొన్నారు.

Donald Trump
North Korea
Kim Jong-un
honorable
  • Loading...

More Telugu News