India: 2019 వరల్డ్ కప్ క్రికెట్... ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ తేదీ ఖరారు!
- వచ్చే సంవత్సరం జూన్ 5న మ్యాచ్
- తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న టీమిండియా
- 1992 తరువాత రౌండ్ రాబిన్ లీగ్ లో మ్యాచ్ లు
వచ్చే సంవత్సరం బ్రిటన్ లో జరిగే ప్రపంచకప్ క్రికెట్ పోటీల తేదీలు స్వల్పంగా మారాయి. లోధా కమిటీ చేసిన సూచనల మేరకు ఐపీఎల్ ఫైనల్ తరువాత ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు 15 రోజుల విరామం ఇవ్వాల్సి వుండటంతో భారత్ ఆడే తేదీల మార్పు అనివార్యమైంది. 2019లో ఐపీఎల్ మార్చి 29 నుంచి మే 19 వరకూ జరగనుండగా, ఆపై 15 రోజుల విరామాన్ని కలిపితే, జూన్ 5వ తేదీనే ఇండియా తొలి మ్యాచ్ ఆడగలుగుతుంది.
దీంతో తొలుత అనుకున్న జూన్ 2న కాకుండా, జూన్ 5న భారత్ తన తొలి మ్యాచ్ ని దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై ఇండియా జూన్ 16న తలపడనుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో మ్యాచ్ లు సాగనుండగా, అన్ని జట్లు అందరితో తలపడనున్నాయి. 1992 తరువాత వరల్డ్ కప్ పోటీలు రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో జరగడం ఇదే తొలిసారి.
కాగా, 2019 నుంచి 2023 మధ్య భారత జట్టు 309 రోజుల పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ ను ఆడనుంది. గడచిన ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఇది 92 రోజులు తక్కువ కావడం గమనార్హం. 2014 నుంచి వచ్చే సంవత్సరం క్రికెట్ సీజన్ ముగిసేలోగా ఇండియా జట్టు 401 రోజుల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడినట్టు అవుతుంది.