web sites: శృంగార వెబ్ సైట్లను నిషేధించండి..వాటి వల్లే అత్యాచారాలు: కేంద్రానికి లేఖ రాసిన మధ్యప్రదేశ్
- పోర్న్ వెబ్ సైట్లు నిషేధించాలని డిమాండ్ చేసిన మధ్యప్రదేశ్
- వీటి ప్రభావంతోనే యువకులు నేరాలకు పాల్పడుతున్నారు
- 25 పోర్న్ వెబ్ సైట్లను నిషేధించాం
పోర్న్ వెబ్ సైట్ల వల్ల లైంగిక నేరాలు పెరుగుతున్నాయని మధ్యప్రదేశ్ హోం మంత్రి భూపేంద్రసింగ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖలో పన్నెండేళ్ల లోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే రేపిస్టులను ఉరి తీయాలని కోరుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును గత నవంబర్ లోనే ఆమోదించామని అన్నారు. గత నవంబర్ లో తమ రాష్ట్రం చేసిన తీర్మానాన్ని ఆదర్శంగా తీసుకున్న కేంద్రసర్కారు చట్టసవరణ చేయడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆయన తెలిపారు. బాలికలపై దాష్టీకాలకు పాల్పడేవారికి సమాజంలో జీవించే హక్కు లేదని, వారిని కచ్చితంగా ఉరి తీయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.
పోర్న్ వెబ్ సైట్లను తక్షణం నిషేధించాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. ఈ వెబ్ సైట్లు చూసి, ప్రభావితులైన యువకులు అత్యాచారం, లైంగిక వేధింపుల వంటి నేరాలకు పాల్పడుతున్నారని తమ అధ్యయనంలో తేలిందని ఆయన లేఖలో వెల్లడించారు. దీంతో తాము 25 పోర్న్ వెబ్ సైట్లను నిషేధించామని ఆయన తెలిపారు. సమాజంలో లైంగిక నేరాలు తగ్గించేందుకు వీలుగా పోర్న్ వెబ్ సైట్లను వెంటనే నిషేధించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.