Andhra Pradesh: సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా సెక్స్ వర్కర్లుగా మారుతున్న యువతులు.. నిపుణుల అభిప్రాయం
- మానవ అక్రమ రవాణాపై అమరావతిలో వర్క్ షాప్
- ఇది తీవ్రమైన సామాజిక సమస్య: డీజీపీ మాలకొండయ్య
- ట్రాఫికింగ్‌కి పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం
- సెక్స్ వర్కర్లపై కేసులు పెట్టడం లేదు
సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగానే చాలా మంది యువతులు, బాలికలు వ్యభిచారకూపంలోకి దిగుతున్నారని ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులో ఈ రోజు ఉదయం మానవ అక్రమ రవాణాపై జరిగిన వర్క్ షాప్ లో పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. ఎక్కువ మంది పేద వర్గాలు, అణగదొక్కబడిన కులాల వారే ఇందులో చిక్కుకుంటున్నారని, అయితే కొందరు విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడినవారు, తేలికగా డబ్బు సంపాదించవచ్చన్న ఉద్దేశంతో ఉన్నవారు కూడా ఈ వృత్తిలోకి దిగుతున్నారని చెప్పారు. యువతులను మోసం చేసి, ప్రలోభ పెట్టి ఈ వృత్తిలోకి దింపేవారిపై, ముంబై, పూణె, గల్ఫ్ దేశాలకు పంపే వారిపై, అమ్మేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.
అమాయకంగా తెలిసీతెలియక ఈ వృత్తిపట్ల ఆసక్తి చూపేవారికి అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. సెక్స్ వర్కర్లను, ట్రాఫికింగ్ ను వేరుగా చూడాలని, సెక్స్ వర్కర్లపై దాడులు ఆపాలని, లేని ప్రాంతాల్లో రిహాబిలేషన్ హోమ్స్ ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. తండాల నుంచి యువతులను ముంబై, పూణె, గల్ఫ్ దేశాలకు పంపడాన్ని ఆపాలని, ఉజ్వల హోమ్స్ ని మెరుగుపరచాలని, సెక్స్ వర్కర్ల పునరావాసం కోసం రెండు ఎకరాల భూమి ఇవ్వాలని, సెక్స్ వర్కర్లకు ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ ఇప్పిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెప్పారు.
ఇది తీవ్రమైన సామాజిక సమస్య: డీజీపీ
ఇది చాలా తీవ్రమైన సామాజిక సమస్య అని ఏపీ డీజీపీ మాలకొండయ్య పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సెక్స్ వర్కర్లకు సంబంధించి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు లేవనెత్తిన కొన్ని సమస్యలకు ఆయన పరిష్కార మార్గాలను చెప్పారు. కొన్ని సమస్యలను జిల్లా స్థాయిలోనే జిల్లా కలెక్టర్, డీఆర్డీఏ, ఇతర శాఖల సమన్వయంతో పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు. సెక్స్ వర్కర్లపై దాడులు చేయడం ఆపేశామని, ట్రాఫికింగ్ ని వేరుగానే చూస్తున్నామని అన్నారు. ట్రాఫికింగ్ (మనుషుల అక్రమ రవాణా)కి పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని, సెక్స్ వర్కర్లపై కేసులు పెట్టడంలేదని, వారిని బాధితులుగానే పరిగణిస్తున్నామని చెప్పారు.
హూస్టన్ లో విస్తృతంగా ప్రచారం
మానవ అక్రమ రవాణకు వ్యతిరేకంగా తమ హూస్టన్ లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు అమెరికా నిపుణురాలు, హూస్టన్ అధికారి మినాల్ పటేల్ డేవిస్ చెప్పారు. సెక్స్ వర్కర్లు, మానవ అక్రమ రవాణాపై హూస్టన్ లోని పరిస్థితులను, తీసుకుంటున్న చర్యలను ఆమె వివరించారు. ఈ అంశానికి సబంధించి 1200 మంది ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు.
ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కే సునీత పర్యవేక్షణలో నిర్వహించిన ఈ వర్క్ షాప్ లో సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్, కృష్ణా జిల్లా న్యాయమూర్తి పీఆర్ రాజు, విజయవాడ డీసీసీ బ్రహ్మారెడ్డి, కృష్ణా జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ రాజీవ్, సీఐడి విభాగం ప్రాంతీయ అధికారి మేరి ప్రశాంతి, డీఎస్పీలు సరిత, శ్రీలక్ష్మి, యుఎస్ కాన్స్ లేట్ కు చెందిన చందిల్, పద్మజ, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.