cbi ex jd: నా రాజకీయ రంగ ప్రవేశం మీడియా కల్పితం.. ఆధ్యాత్మికత తగ్గడమే అఘాయిత్యాలకు కారణం!: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- ఆధ్యాత్మికత వైపు మళ్లించడం ద్వారా నేరాలను తగ్గించవచ్చు
- ప్రత్యేకహోదాపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుంది
- మీడియా ప్రజలను రెచ్చగొట్టేలా ఉండకూడదు
తాను రాజకీయాల్లోకి వస్తున్నానన్న వార్త మీడియా కల్పన అని మహారాష్ట్ర అడిషనల్ డీజీపీ, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. హైదరాబాదులో జరిగిన ఒక అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేకహోదాపై అన్ని వర్గాల వారు తమ వాదన వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రం కచ్చితంగా సానుకూల పరిష్కారం చూపుతుందని నమ్ముతున్నానని అన్నారు.
ప్రజలను రెచ్చగొట్టే విధంగా మీడియా ఉండకూడదని ఆయన సూచించారు. సమాజంలో ఆధ్యాత్మికత తగ్గడమే పసిపిల్లలు, మహిళలపై అత్యాచార ఘటనలు పెరగడానికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆధ్యాత్మికత వైపు మళ్లించడం ద్వారా మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన అన్నారు. దీనికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నడుంబిగించాలని ఆయన సూచించారు.