USA: ఆ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటే, అణ్వాయుధాలు తయారు చేస్తాం: ఇరాన్ సంచలన ప్రకటన
- 2015 అణుఒప్పందం నుంచి అమెరికా తప్పుకోకూడదు
- అణుబాంబులు తయారు చేయాలని కోరుకోవడం లేదు
- అణుపరీక్షలు మళ్లీ మొదలు పెడతాం
వరుస అణు పరీక్షలతో ప్రపంచం మొత్తాన్ని ఆందోళనకు గురి చేసిన ఉత్తరకొరియా అణుపరీక్షలు నిలిపేస్తున్నామని చేసిన ప్రకటన అమెరికాకు ఆనందాన్నిచ్చేలోపే.. న్యూయార్క్ వేదికగా ఇరాన్ బాంబు లాంటి ప్రకటన చేసింది. 2015 అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటే మళ్లీ అణు కార్యక్రమాలు మొదలు పెడతామని ఇరాన్ స్పష్టం చేసింది.
ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఇరాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ జావిద్ షరీఫ్ న్యూయార్క్ లో మాట్లాడుతూ, అణుబాంబులు తయారు చేయాలని తాము కోరుకోవడం లేదని అన్నారు. ఐతే, అమెరికా 2015 అణుఒప్పందం నుంచి తప్పుకుంటే మాత్రం అణుబాంబులు తయారు చేస్తామని స్పష్టం చేశారు. ఈ అణు ఒప్పందానికి కట్టుబడి ఉండే విషయమై యూరోపియన్ యూనియన్ దేశాలు ఒక స్పష్టతకు రావాలని మే 12 వరకు అమెరికా గడువునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది.