petrol: ఊహించని స్థాయికి డీజిల్, పెట్రోల్ ధరలు... వాహనదారులపై భారం
- హైదరాబాద్ మార్కెట్లో లీటర్ పెట్రోల్ రూ.78.49
- డీజిల్ లీటర్ ధర రూ.71
- రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు
క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగింది కొంచెమే అయినా మన దేశంలో మాత్రం అవి తార స్థాయికి చేరి వాహనదారులను గగ్గోలు పెట్టిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం క్రూడాయిల్ అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ కు 135 డాలర్లుగా ఉంది. ఆ సమయంలో మన దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.83 వరకు వెళ్లింది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. 30 డాలర్ల వరకు పడిపోయాయి. క్రమంగా మళ్లీ పెరుగుతూ ప్రస్తుతం 74 డాలర్ల స్థాయికి ముడి చమురు ధర చేరింది. నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయ మార్కెట్లో 135 డాలర్లు ఉన్న సమయంలో మన దేశంలో పెట్రోల్ ధర రూ.83 అయితే, ఇప్పుడు 73 డాలర్ల స్థాయికే పెట్రోల్ ధర రూ.78కి చేరడం గమనార్హం.
హైదరాబాద్ మార్కెట్లో పెట్రోల్ లీటర్ ధర రూ.78.49కి చేరగా, డీజిల్ ధర లీటర్ కు రూ.71.12కు పెరిగింది. డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేసిన తర్వాత బహిరంగ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఆయిల్ కంపెనీలు ధరలను నిర్ణయిస్తున్న విషయం తెలిసిందే. దీంతో డీజిల్ ధరలు మన దేశ చరిత్రలోనే గరిష్ట స్థాయికి చేరాయి. మన దేశంలో నిత్యావసరాలు ఎక్కువగా డీజిల్ ఆధారిత వాహనాల్లోనే రవాణా అవుతుంటాయి. దీంతో త్వరలో ఉత్పత్తుల రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయంగా పలు దేశాల మధ్య వాణిజ్య ఘర్షణలు, ఓపెక్ దేశాలు చమురు ఉత్పత్తికి కోత పెట్టడం వంటి అంశాల నేపథ్యంలో రానున్న కాలంలో చమురు ధరలు బ్యారెల్ కు 80-100 డాలర్ల వరకు చేరొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో మన దేశీయ మార్కెట్లో డీజిల్, పెట్రోల్ ధరలు మరింత భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.