Chris gayle: దటీజ్ గేల్! ఐపీఎల్‌లో తొలి రెండు మ్యాచులు ఆడకున్నా అతడే టాప్!
- ఆడిన మూడు మ్యాచుల్లో రెండు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ
- 21 సిక్సర్లతో అందులోనూ ముందు
- రెండుసార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకున్న వైనం
ఐపీఎల్ వేలంలో చివరి నిమిషంలో అమ్ముడుపోయి, ఆపై జరిగిన రెండు మ్యాచులకు రిజర్వు బెంచ్‌కే పరిమితమైన విండీస్ విధ్వంసకర ఆటగాడు, కింగ్స్ ఎలెవన్ జట్టు ఓపెనర్ క్రిస్ గేల్ తానెంత స్పెషలో మరోసారి చాటిచెప్పాడు. గత సీజన్‌లో ఫెయిలయ్యాడన్న అపనమ్మకమో, ఏమో కానీ ఐపీఎల్‌లో భాగంగా జరిగిన తొలి రెండు మ్యాచులకు పంజాబ్ జట్టు గేల్‌ను దూరం పెట్టింది.
మొహాలీలో 15న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్‌కు ఆడే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్‌లో 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేసిన గేల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 19న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ శివాలెత్తిపోయాడు. 63 బంతుల్లో 11 సిక్సర్లు, ఒకే ఒక్క ఫోర్‌తో అజేయ సెంచరీ (104) చేసి తానేంటో మరోసారి నిరూపించాడు. ఇక తాజాగా శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ మరోసారి రెచ్చిపోయాడు. 38 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు.
ఆడిన మూడు మ్యాచుల్లోనూ 50కిపైగా పరుగులు చేసిన గేల్ మొత్తం 229 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి రెండు మ్యాచ్‌లు ఆడకున్నా పరుగుల వేటలో మాత్రం గేల్ ముందుండడం విశేషం. అంతేకాదు, మూడు మ్యాచుల్లో రెండింటిలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్నాడు. అలాగే ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 21 సిక్సర్లు బాదిన గేల్ ఈ విషయంలోనూ ముందున్నాడు.