Salman Khan: హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ అరెస్ట్ వారెంట్ రద్దు

  • హిట్ అండ్ రన్ కేసులో నెల రోజుల క్రితం అరెస్ట్ వారెంట్ జారీ
  • కోర్టుకు హాజరై పూచీకత్తు చెల్లించడంతో వారెంట్ రద్దు
  • 2002 నాటి హిట్ రన్ కేసును 2015లోనే కొట్టేసిన కోర్టు

2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఊరట లభించింది. అతడిపై జారీ అయిన బెయిలు ఇవ్వదగిన అరెస్ట్ వారెంట్‌ను శనివారం ముంబై కోర్టు కొట్టివేసింది. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించడంపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా పూచీకత్తు సమర్పించడంలో సల్మాన్ విఫలం కావడంతో గత నెలలో ముంబై కోర్టు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది.

52 ఏళ్ల సల్మాన్ శనివారం అడిషనల్ సెషన్స్ జడ్జి ఎంజీ దేశ్ పాండే ఎదుట హాజరయ్యాడు. పూచీకత్తుకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించడంతో అతడిపై జారీ అయిన అరెస్ట్ వారెంట్‌ను రద్దు చేసింది.

సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా డిసెంబరు 2015లో సల్మాన్‌ ఖాన్‌పై నమోదైన కేసును బాంబే హైకోర్టు కొట్టివేసింది. అంతకు ఏడు నెలల ముందు ఈ కేసులో సల్మాన్‌ను సెషన్స్ కోర్టు దోషిగా తేల్చడం గమనార్హం. 2002లో బాంద్రాలో పేవ్‌మెంట్‌పై నిద్రిస్తున్న వారి మీదుగా సల్మాన్ కారును నడిపి ఒకరి మరణానికి కారణమయ్యాడన్న ఆరోపణపై ట్రయల్ కోర్టు అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

మరోపక్క, 1998 నాటి కృష్ణ జింకల వేట కేసులో ఈనెల 5న జోధ్‌పూర్ కోర్టు సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. జైలులో రెండు రోజులు గడిపిన తర్వాత సల్మాన్‌కు బెయిలు మంజూరు కావడంతో బయటకు వచ్చాడు.
 

  • Loading...

More Telugu News