CBI: ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- ప్రస్తుత పరిస్థితుల్లో స్థిరమైన ప్రభుత్వాలు అవసరం
- ఏపీకి ప్రత్యేక హోదాతో ఎంతో మేలు
- రాజకీయాల్లోకి వస్తున్నానన్న వార్తలు ఆశ్చర్యం కలిగించాయి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. విశాఖపట్టణం సీతమ్మధారలోని వినాయకుడి ఆలయంలో పూజలు చేసిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం సుస్థిర ప్రభుత్వాల అవసరం ఎంతో ఉందని, ప్రజలను సంతోష పెట్టడమే ప్రభుత్వాల ధ్యేయం కావాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రజల వరకు వెళ్లినప్పుడే ఆశించిన ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందన్న లక్ష్మీనారాయణ.. ప్రత్యేక హోదాతో పరిశ్రమలు వస్తాయని, తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. తాను రాజకీయాల్లోకి వస్తానని ఎవరితోనూ, ఎప్పుడూ చెప్పలేదని, అయినా తాను వస్తున్నట్టు పత్రికల్లో వస్తున్న వార్తలను చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. అయితే, నిరుపేదలకు సేవ చేయాలంటే మాత్రం రాజకీయాలు అవసరమని స్పష్టం చేశారు.
ప్రస్తుతం తన రాజీనామా ఫైల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద ఉందని, అక్కడి నుంచి క్లియరెన్స్ రాగానే భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తానని లక్ష్మీనారాయణ తెలిపారు. అంతకంటే ముందు రాష్ట్రంలోని సమస్యలను అధ్యయనం చేస్తానని వివరించారు.