raghuveera reddy: ఉన్నట్టుండి రూ.2 వేల నోట్లు చలామణి నుండి మాయమైపోయాయి: రఘువీరారెడ్డి
- బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడింది
- దేశంలోనే అతిపెద్ద స్కాం పెద్దనోట్ల రద్దు
- ప్రజలకు బ్యాంకింగ్, ఏటీఎం సర్వీసులు దూరం
- ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు బ్యాంకులకు పెను భూతంగా తయారైంది
బ్యాంకులను జాతీయం చేసి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సామాన్య ప్రజలకు వాటిని అందుబాటులోకి తీసుకువస్తే ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం తన తుగ్లక్ చర్యల ద్వారా వాటిని దూరం, భారం చేశారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో మొదలైన 'ఏటీఎంలలో, బ్యాంకుల్లో నగదు కొరత' ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చిందని వ్యాఖ్యానించారు. ఆనాడు ప్రధాని మోదీ 50 రోజుల టైం ఇవ్వమన్నారని, ఆలోగా పరిస్థితిని చక్కదిద్దకపోతే తనను ఉరి తీయమని అన్నారని, మరి ఇప్పుడేమంటారని నిలదీశారు.
ఈ రోజు విజయవాడలోని పలు బ్యాంకుల వద్ద ఏపీసీసీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ.... "ఏడాదిన్నరగా ఏటీఎంలలోనే కాదు.. బ్యాంకుల్లోనూ సొమ్ముల్లేవు.. దశాబ్దాలుగా బ్యాంకులపై ప్రజలు పెంచుకున్న విశ్వాసాన్ని గత రెండేళ్ల పరిణామాలు దెబ్బ తీశాయి. పెద్ద నోట్ల రద్దు పెద్ద దెబ్బ కొడితే, ఎఫ్‌ఆర్‌డీఐ (ఫైనాన్షియల్ రిసొల్యుషన్ డిపాజిట్ ఇన్సురెన్స్) బిల్లు బ్యాంకులకు పెను భూతంగా తయారయింది. నోట్ల రద్దు ప్రపంచంలోనే అతిపెద్ద స్కాం.
ప్రస్తుతం ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉంది. ఇందులోని ఒక నిబంధన ప్రకారం ఏదయినా బ్యాంకు దివాళా తీస్తే అందులోని డిపాజిట్ల మెచ్యూరిటీ గడువును పెంచవచ్చు. లేదా డిపాజిట్లను కస్టమర్లకు ఇవ్వకుండా నిలిపి వేయవచ్చు. సేవింగ్స్ ఖాతాల్లో సొమ్మును కూడా చెల్లించకుండా నిలిపేయవచ్చు. ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లుకు భయపడి ఖాతాదారులు డిపాజిట్ లు రద్దు చేసుకుని డబ్బు వాపసు తీసుకోవటం, పెద్ద నోట్ల రద్దు అనంతర పరిస్థితులు బ్యాంకుల్లో, ఏటీఎంలలో నగదు లేమికి కారణం అయ్యాయి.
హా హా.. చూడబోతే మోదీ గారి కాష్ లెస్ ఇండియా గోల్ నెరవేరినట్లే కనిపిస్తోంది. నేనే పెద్ద నోట్ల రద్దుకు సలహా ఇచ్చానని గప్పాలు కొట్టి, తదుపరి మోదీ డిజిటల్ పేమెంట్స్ పై వేసిన ముఖ్యమంత్రుల కమిటీకి నేతృత్వం వహించిన నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటారో? ఉన్నట్టుండి 2000 నోట్లు చలామణి నుండి మాయమై పోవటం కూడా బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడటానికి కారణం. ఈ పెద్ద నోట్లన్నీ బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ వంటి పార్టీల వారు దాచేశారు.
బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీ రేట్లు గతంలో 8.5-9 శాతంగా ఉంటే ఇప్పుడు 6.5-6.75 శాతానికి పడిపోయాయి. బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేయటానికి ఎవ్వరూ ఇష్టపడటంలేదు. కష్టపడి సంపాదించుకుని బ్యాంకుల్లో దాచుకున్న సామాన్య ప్రజలకు ఆరోగ్య ఖర్చులు, పెళ్లిళ్ల వంటి అవసరాలకు కూడా డబ్బు అందుబాటులో లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో నల్లధనాన్ని బయటకుతెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్‌లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తానన్న మోదీ మాటలు కల్లలైనాయి.
గతంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడ్డ బ్యాంకింగ్ వ్యవస్థను మోదీ ప్రభుత్వ చర్యలు పెను సంక్షోభంలోకి నెట్టేశాయి. ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన మోదీ ప్రభుత్వాన్ని, దానికి వత్తాసు పలికిన చంద్రబాబును సాగనంపాల్సిన సమయం ఆసన్నమైంది" అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న డిమాండ్లు:
* ప్రజల్లో భయాందోళనలకు కారణమైన ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ప్రతిపాదనను విరమించుకోవాలి. ప్రజల్లో విశ్వాసం కల్పించకపోతే పెను సంక్షోభం తప్పదు
* డిపాజిట్లపై వడ్డీ శాతాన్ని 12 శాతానికి పెంచాలి
* బ్యాంకుల్లో, ఏటిఎంలలో తగినంత క్యాష్ ఉంచటమే కాకుండా ప్రజలు వారికి కావలసినంత డ్రా చేసుకునే అవకాశం ఇవ్వాలి
* పుండు మీద కారం చల్లినట్టు బ్యాంకు సర్వీసులపై 18 శాతం జీఎస్టీ విధించారు.. దాన్ని వెంటనే రద్దు చేయాలి
* నోట్ల రద్దు నిర్ణయం తప్పు అని ఒప్పుకుని మోదీ చెంప లేసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే రాజీనామా చేసి గద్దె దిగాలి.