Chandrababu: చంద్రబాబు దీక్ష వయసు మళ్లిన తర్వాత కాపురంలా ఉంది: సీపీఐ నేత నారాయణ

  • రాజకీయాల్లోకి వచ్చాకే పవన్ ని వివాదాస్పదం చేశారు
  • కేంద్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోంది
  • జడ్జి లోయా గట్టిగా నిలబడుంటే మోదీ, అమిత్ షా జైలులో ఉండే వాళ్లు

విజయవాడలో ధర్మ పోరాట దీక్ష చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై సీపీఐ నేత నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు దీక్ష వయసు మళ్లిన తర్వాత కాపురంలా ఉందని, ఈ దీక్షతో ఒరిగేదేమీ లేదని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

పవన్ కల్యాణ్ గతంలో ఎప్పుడూ వివాదాస్పదం కాలేదని, రాజకీయాల్లోకి వచ్చాకే పవన్ ని వివాదాస్పదం చేశారని విమర్శించారు. ఎవరినైనా తప్పులుంటే విమర్శించాలి తప్ప, వ్యక్తిత్వ హననం సబబు కాదని అన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. జడ్జి లోయా మరణం వివాదాస్పదమని లోకం కోడై కూస్తోందని, దీనిపై సుప్రీంకోర్టు తీర్పు ఏకపక్షంగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో అమిత్ షా నిందితుడిగా ఉన్నారని, జడ్జి లోయా గట్టిగా నిలబడి ఉంటే అమిత్ షా, మోదీ జైలులో ఉండే వారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Chandrababu
CPI Narayana
  • Loading...

More Telugu News