Andhra Pradesh: ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో దీక్ష చేయాలి : చలసాని శ్రీనివాస్
- చంద్రబాబు చేస్తున్న నిరాహార దీక్షలో పాల్గొన్న చలసాని
- మనలో ఐకమత్యం లేకపోవడం వల్లే చులకనైపోతున్నాం
- అందరం కలిసి దిక్కులు పిక్కటిల్లేలా సింహనాదం చేద్దాం
ఢిల్లీలో టీడీపీ, వైసీపీ ఎంపీలు బాగానే పోరాడారని, అయితే, మనలో ఐకమత్యం లేకపోవడంతో ఇతరుల వద్ద చులకనై పోతున్నామని ప్రత్యేక హోదా సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. ఏపీకి బీజేపీ చేసిన మోసాన్ని నిరసిస్తూ సీఎం చంద్రబాబునాయుడు విజయవాడలో చేస్తున్న నిరాహార దీక్షలో పాల్గొన్న చలసాని సంఘీభావం ప్రకటించారు.
అనంతరం, ఆయన మాట్లాడుతూ, ‘చంద్రబాబునాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు ఆంధ్రుల హక్కులకు, ఆత్మగౌరవానికి భంగం కలిగే పరిస్థితులు వచ్చాయి. అటువంటి గొప్ప పోరాట చరిత్ర ఉన్న ఆంధ్రులు ఈరోజున అవమానభారంతో ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడానికి కారణం మోదీజీ, అమిత్ షాజీ. రాష్ట్ర విభజన హామీలను ఒకవైపు ఉద్యమంతో, మరోవైపు చాకచక్యంతో సాధించుకోవాలి. ఉద్యమ స్ఫూర్తి నలుచెరగులా చేరాలంటే, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు, న్యాయవాదులు, వైద్యులు, సమాజంలో అన్నిరంగాల వారు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
అందరినీ కలుపుకుని వెళ్లాలని ముఖ్యమంత్రి గారికి నా వినతి. ఇంతకుముందు, మేము అందరినీ కలుపుకుని వెళతామన్నప్పుడు వారి పార్టీ రాలేదు. రెండు, మూడు మెట్లు తగ్గయినా సరే, అందరిని కలుపుకు పోవాలి. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో దీక్ష చేయాలని కోరుతున్నా. రాష్ట్రం మొత్తం ఒకటిగా ఉంటే తప్ప, దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కేంద్రం మన మాట వినదు. మనలో మనమే హేళన చేసుకుంటుంటే నవ్వుతున్నారు. ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన గొప్ప మహనీయుడు. ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని అందరం కలిసి దిక్కులు పిక్కటిల్లేలా సింహనాదం చేద్దాం. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కేంద్రం వైఖరిని, వారికి సహకరించే వారిని కచ్చితంగా ఎండగడదాం’ అని చలసాని పిలుపు నిచ్చారు.