Pakistan: పాక్ మాజీ ప్రధానికి వ్యతిరేకంగా.. మిలటరీకి అనుకూలంగా వార్తల ప్రసారానికి జియో టీవీ ఓకే.. నిషేధం ఎత్తివేత!
- నవాజ్ షరీఫ్‌ను సమర్థిస్తూ వార్తలు ప్రసారం చేయవద్దని మిలటరీ ఆదేశాలు
- సుప్రీంకోర్టు, మిలటరీకి వ్యతిరేకంగా వార్తలు ఇవ్వమని జియో టీవీ హామీ
- తిరిగి ప్రారంభమైన జియో టీవీ ప్రసారాలు
పాకిస్థాన్‌లోని అతిపెద్ద టీవీ నెట్‌వర్క్ అయిన జియో టీవీ ప్రసారాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆ దేశ మిలటరీకి వ్యతిరేకంగా ఇకపై వార్తలు ప్రసారం చేయబోమని, పాక్ సుప్రీంకోర్టును విమర్శించబోమని జియో టీవీ హామీ ఇవ్వడంతో నిషేధాన్ని ఎత్తివేశారు. అంతేకాదు.. అవినీతి ఆరోపణలతో ప్రధాని పదవి నుంచి తప్పుకున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అనుకూలంగా వార్తలు ప్రసారం చేయబోమన్న హామీ మేరకే ఆ చానల్‌పై నిషేధం ఎత్తివేసినట్టు తెలుస్తోంది.
మిలటరీ చేస్తున్న డిమాండ్లలో అధికశాతాన్ని జియో టీవీ అంగీకరించినట్టు జియో టీవీ మాతృసంస్థ ‘జంగ్ గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్’ ద్వారా తెలిసింది. అయితే ఫైనల్ డీల్ ఇంకా పూర్తికాలేదన్నది సమాచారం. కాగా, చానల్ మూసివేత వ్యవహారంలో మిలటరీ పాత్రపై సమాధానం చెప్పేందుకు జియో టీవీ నెట్‌వర్క్ అధ్యక్షుడు ఇమ్రాన్ అస్లాం నిరాకరించారు.
మరోవైపు.. జియో టీవీ అధికారిక ప్రతినిధి మాట్లాడుతూ.. వార్తకు రెండు వైపులా ఏమున్నదో చూపించడమే చానల్ లక్ష్యమన్నారు. స్వతంత్రంగా పనిచేసే ఎడిటోరియల్ విధానం ప్రతిసారీ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు. తాము ఎప్పుడైనా స్వాతంత్ర్యానికి లొంగిపోయే పరిస్థితి వస్తే అప్పుడు చానల్‌ను మూసివేస్తామని పేర్కొన్నారు. కాగా, కేబుల్ ఆపరేటర్లపై మిలటరీ ఒత్తిడి తెస్తోందన్న ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు.