Banks: నగదు కొరతపై తిరగబడుతున్న బ్యాంకు ఉద్యోగులు.. ఆందోళనకు దిగుతామని హెచ్చరిక
- దేశవ్యాప్తంగా తీవ్రమవుతున్న నగదు కొరత
- బ్యాంకు ఉద్యోగులతో ఘర్షణ పడుతున్న ఖాతాదారులు
- ఇక తమ వల్ల కాదంటున్న బ్యాంకు ఉద్యోగులు
దేశవ్యాప్తంగా నగదు కొరతతో జనాలు ఇబ్బంది పడుతుండగా బ్యాంకులు మాత్రం నిమ్మకు నీరెత్తి కూర్చోవడాన్ని బ్యాంకు ఉద్యోగులు సైతం తప్పుబడుతున్నారు. నగదు విత్ డ్రా కోసం బ్యాంకులకు వచ్చే వారిని సముదాయించలేక నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని బ్యాంకుల్లో ఉద్యోగులతో ఖాతాదారులు గొడవకు దిగుతున్నారు. బ్యాంకుల్లో రోజూ ఇటువంటి సీన్లే కనపడుతుండడంతో బ్యాంకు ఉద్యోగులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులకు సరిపడా నగదు సరఫరా చేయకుండా ఇలాగే మీనమేషాలు లెక్కిస్తే స్వయంగా తామే ఆందోళనకు దిగుతామని బ్యాంకు యూనియన్లు హెచ్చరిస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ), కేంద్రం తీరు వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని, ఇందులో తమ పాత్ర లేనప్పటికీ అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నచ్చజెప్పేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా వారు వినిపించుకోవడం లేదని, ఇది ఇలాగే కొనసాగితే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం అన్నారు. కేంద్రం, ఆర్బీఐ తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.