allu aravind: ఇప్పుడు కొందరి వల్ల టాలీవుడ్ తలదించుకోవాల్సి వస్తోంది!: మీడియాతో అల్లు అరవింద్
- ఇండస్ట్రీ వల్లే బతుకుతున్నాం
- మాకు ఇండస్ట్రీపై కృతజ్ఞత, భక్తి, గౌరవం వున్నాయి
- 50 శాతం ఎన్జీవోలు, 50 శాతం ఇండస్ట్రీకి చెందిన వారితో కమిటీ
- ఎవరైనా తప్పుడు పనిచేస్తే చర్యలు తీసుకుంటాం
తెలుగు ఫిలిం ఇండస్ట్రీపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయని, కొన్ని రోజులుగా జరుగుతోన్న పరిణామాలు తనకు బాధను కలిగించాయని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఈ రోజు ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 'ఇండస్ట్రీ వల్లే బతుకుతోన్న మాకు ఇండస్ట్రీపై కృతజ్ఞత, భక్తి గౌరవం వున్నాయి. శ్రీరెడ్డి వివాదంపై మేము చర్చించాం. ఇండస్ట్రీలో మహిళల సమస్యల పరిష్కారాల కోసం కమిటీ వేయాల్సి ఉంది. 50 శాతం ఎన్జీవోలు, 50 శాతం ఇండస్ట్రీకి చెందిన మహిళలతో ఈ కమిటీ ఉంటుంది.
ఈ కమిటి విచారణ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే ఉంటుంది. ఓ నిర్మాత తప్పుడు పని చేస్తే నిర్మాతల మండలి నుంచి తొలగిస్తాం. దర్శకుడు, ఇతర ప్రముఖులు ఎవరయినా తప్పుడు చర్యలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటాం' అని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. బాహుబలి వంటి అద్భుతమైన సినిమాలు నిర్మించి ఛాతీ విరుచుకొని గొప్పగా నిలబడ్డ మన టాలీవుడ్ ఇప్పుడు కొందరి వల్ల తలదించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.