Donald Trump: కిమ్ తో సమావేశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: డొనాల్డ్ ట్రంప్
- మరికొన్ని వారాల్లో కిమ్ ను కలవనున్నాను
- సమావేశం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను
- చర్చలు విజయవంతమైతే ప్రపంచానికి అద్భుతం
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తో సమావేశం ఆశాజనకంగా లేకపోతే వెంటనే బయటకు వచ్చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఫ్లోరియాలో జపాన్ ప్రధాని షింజో అబేతో నిర్వహించిన సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అణ్వస్త్ర రహితంగా మారడంపై మరికొన్ని వారాల్లో కిమ్ జాంగ్ ఉన్ తో చర్చల్లో పాల్గొననున్నానని తెలిపారు. సమావేశం ప్రయోజనకరంగా ఉండదని ముందుగా అనిపిస్తే అసలు చర్చలకే వెళ్లమని ఆయన చెప్పారు.
కిమ్ తో సమావేశం విజయవంతం కావాలని కోరుకుంటున్నానని, అందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. సమావేశం సజావుగా సాగితే ప్రపంచానికి అది ఒక అద్భుత విషయమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తరకొరియాలో బందీలుగా ఉన్న అమెరికన్లను విడుదల చేసే అంశంపై కిమ్ తో మాట్లాడుతానని ఆయన చెప్పారు. ఉత్తరకొరియా విషయంలో సహాయం చేస్తున్నందుకు ట్రంప్ చైనాను అభినందించారు.
కిమ్, ట్రంప్ సమావేశం కోసం రెండు దేశాలకు చెందిన ప్రతినిధులు సమావేశాలు జరిగే వేదికను నిర్ణయించే పనిలో ఉన్నారు. ఈ సమావేశాలకు ఐదు వేర్వేరు వేదికలను పరిశీలించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ చర్చలు జూన్ ప్రారంభంలో ఉండవచ్చని తెలుస్తోంది.