Japan: జపాన్ తలరాతను మార్చేసే 'బురద' దీవి!
- బురదమయమైన మినమిటోరి దీవి
- దీవిలో 1.6 కోట్ల టన్నుల బురద
- బురదలో అత్యంత అరుదైన ఖనిజ నిక్షేపాలు
పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న మినమిటోరి దీవిలో అత్యంత అరుదైన ఖనిజాన్ని కనుగొన్నారు. ఈ దీవి జపాన్ రాజధాని టోక్యోకి 1200 కిలోమీటర్ల దూరంలో నడిసంద్రంలో ఉంది. ఈ దీవిలో 1.6 కోట్ల టన్నుల బురద నిక్షిప్తమై ఉంది. అలాంటి ఈ దీవికి జపాన్ తో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనే మార్చేసేంత శక్తి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే, ఈ బురదలో స్మార్ట్ ఫోన్లు, క్షిపణి వ్యవస్థలు, రాడార్ పరికరాలు, హైబ్రిడ్ వాహనాల తయారీకి అవసరమయ్యే అత్యంత అరుదైన భూఖనిజ నిక్షేపాలున్నాయని తెలిపారు. కెమెరా లెన్సులతో పాటు, సూపర్ కండక్టర్లు, ఫోన్ స్ర్కీన్ల తయారీలో వాడే ఇట్రియం ఈ బురదలో కుప్పలుతెప్పలుగా పడి ఉందని తెలుస్తోంది.
ఈ దీవిలో ఉన్న ఖనిజాల వివరాల్లోకి వెళ్తే... 780 ఏళ్లకు సరిపడా ఇట్రియం, 620 ఏళ్లకు సరిపోయే యూరోపియం, 420 ఏళ్లకు సరిపడా టెర్బియం, 730 ఏళ్లకు సరిపోయే డిస్ర్పోజియం వంటి ఖనిజాలెన్నో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ బాపతు అరుదైన ఖనిజాలు కలిగిన దేశంగా చైనా ఇప్పటివరకు గుత్తాధిపత్యం చెలాయిస్తోంది.
సాంకేతిక వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ జపాన్ వంటి దేశాలు సైతం వీటి విషయంలో చైనాపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇబ్బడిముబ్బడిగా వాటిని తయారు చేసి, నచ్చిన రేటుకి విక్రయిస్తోంది. తాజాగా జపాన్ దీవిలో ఈ ఖనిజాలను కనుగొనడంతో జపాన్ పోటీలోకి రానుంది. దీంతో ఇకపై వివిధ వస్తువుల ధరలు కిందికి దిగి వస్తాయని, వాటి ప్రభావం వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.