Sri Reddy: నాకింకా పెళ్లి కాదు... నా యవ్వనం, మిగిలిన జీవితం అందుకోసమే!: శ్రీరెడ్డి
- వివాహం అవుతుందని అనుకోవడం లేదు
- జీవితాంతం అమ్మాయిలను ఆదుకునేందుకే అంకితం
- సాయం కోసం చూస్తున్న అమ్మాయిలను ఆదుకుంటా
తనకిక జీవితంలో వివాహం అవుతుందని అనుకోవడం లేదని, తన యవ్వనం, మిగిలిన జీవితం, వృద్ధాప్యం మోసపోతున్న అమ్మాయిల తరపున పోరాడేందుకు ఉపయోగిస్తానని టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, తనకు పెళ్లవుతుందని అనుకోవడం లేదని, తాను చేస్తున్న పోరాటానికి, ప్రజా జీవితానికే తన జీవితం అంకితమని చెప్పింది. అందుకోసం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని, మహిళా కార్యకర్తగా ఉంటూ, సహాయం కావాల్సిన అమ్మాయిలకు సాయం చేస్తానని చెప్పింది. ఎంతో మంది అమ్మాయిలు ఏడుస్తున్నారని, వారికి ఏదైనా చేయాలని ఉందని వ్యాఖ్యానించింది.
తన చిన్న వయసులో తమ్ముడు చనిపోయిన తరువాత, తిండి పెట్టే వారు కూడా లేకపోయారని, తమను ఎవరూ పట్టించుకోలేదని, నాలుగైదు రోజుల పాటు స్నానం చేయని సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పింది. కనీసం సినిమా పాటలు కూడా ఇంట్లో వినిపించేవి కాదని వెల్లడించింది. టీవీలో ఏదైనా సినిమా చూస్తుంటే, రొమాంటిక్ సీన్ వస్తే, "నడవండి నడవండి... దిక్కు మాలిన మొహాల్లారా... ఇటువంటి వాటి కోసమే కాసుకుని కూర్చున్నారా?" అంటూ తిట్టి పంపేవారని గుర్తు చేసుకుంది.