meghalaya: మేఘాలయలో 24.5 కిలోమీటర్ల పొడవైన మాయా గుహ గుర్తింపు.. ఎన్నో విశేషాలు!
- వెనెజువెలాలోని ఇమావరి యేటా గుహను మించినదిగా గుర్తింపు
- పొడవైన గుహలో ప్రాణవాయువుకు లోటు లేదు
- దారితప్పితే మాత్రం బయటకు రావడం కష్టమే!
వెనెజువెలాలోని ఇమావరి యేటా గుహను మించిన గుహను మేఘాలయలో పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఇసుకరాతి నేలల్లో ఇప్పటివరకు బయటపడ్డ అత్యంత పొడవైన గుహగా పేరొందిన గుహ వెనెజువెలాలోని ఇమావరి యేటా గుహ పేరొందగా, దాని పొడవు 18.7 కిలోమీటర్లు. మేఘాలయాలో పరిశోధకులు గుర్తించిన గుహ 24.5 కిలోమీటర్ల పొడవు ఉండడం విశేషం. దీంతో ప్రపంచంలో అత్యంత పొడవైన ఇసుకరాతి గుహగా ఇది ఖ్యాతినొందనుంది.
ఈ గుహ పేరు ‘ఖ్రేమ్ పురి’ కాగా, స్థానిక ఖాసీ భాషలో దానికి ‘మాయా గుహ’ అని అర్థం. తూర్పు ఖాసీ హిల్ డిస్ట్రిక్ట్ లోని మాసిన్ రామ్ లో సముద్ర మట్టానికి 4,025 అడుగుల ఎత్తులో, 13 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ‘ఖ్రేమ్ పురి’ విస్తరించి ఉందని వారు తెలిపారు. ఈ గుహల్లో ప్రవేశించిన తరువాత దారి తప్పితే తిరిగి బయటకు రావడం ఇంచుమించు అసాధ్యమని వారు వెల్లడించారు.
ఈ గుహలో షార్క్ చేపల దంతావశేషాలు, 6 కోట్ల ఏళ్ల క్రితం నివసించి ఉన్నట్లుగా భావిస్తున్న సముద్ర డైనోసార్ల ఎముకలను గుర్తించామని వారు తెలిపారు. ఈ గుహ జీవవైవిధ్యానికి పెట్టింది పేరుగా కనిపిస్తోందని వారు చెప్పారు. బయటి ఉష్ణోగ్రతలతో సంబంధం లేకుండా ‘ఖ్రేమ్ పురి’ గుహలో ఎప్పుడూ 16-17 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటున్నట్లు గుర్తించారు. అలాగే ఇంత పొడవైన గుహలో ప్రాణవాయువు సరఫరాకు కూడా కొరత లేదని, రెండు ప్రవేశద్వారాలతోపాటు పగుళ్లు, ఇతర చిన్నచిన్న మార్గాల ద్వారా నిరంతరం గాలి ప్రవేశిస్తుంటుందని వారు వెల్లడించారు.