Akshaya Triteeya: పొద్దున 7 గంటలకే ఓపెన్... బంగారం దుకాణాల్లో సందడి!
- నేడు అక్షయ తృతీయ పర్వదినం
- బంగారం కొనుగోలుకు శుభప్రదం
- ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆభరణాల దుకాణాలు
బంగారు ఆభరణాల కొనుగోలుకు అత్యంత శుభప్రదమైన దినాల్లో ఒకటిగా భావించే అక్షయ తృతీయ సందర్భంగా నేడు జ్యూయెలరీ దుకాణాలను ఉదయం 7 గంటలకే ప్రారంభించగా, కొనుగోలుదారులతో దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. గడచిన వారం పది రోజులుగా మేకింగ్ చార్జీలపై, బంగారం ధరపై, వజ్రాభరణాలపై పలు రకాల ప్రత్యేక ఆఫర్లను ఆభరణాల తయారీ సంస్థలు ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు ఆభరణాల దుకాణాలను ప్రత్యేకంగా అలంకరించారు.
కల్యాణ్ జ్యూయెలర్స్, మానేపల్లి జ్యూయెలర్స్, తనిష్క్, జాయ్ అలుక్కాస్ వంటి సంస్థలు ముందుగా బుక్ చేసుకున్న వారికి, నేడు రద్దీతో నిమిత్తం లేకుండా వెంటనే ఆభరణాలను అందిస్తామని ప్రకటించాయి. బ్రాండెడ్ జ్యూయెలరీ స్టోర్స్ తో పాటు చందనా బ్రదర్స్ వంటి వస్త్రాభరణాల దుకాణాలు సైతం అక్షయ తృతీయను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవడంతో సందడి నెలకొంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం బంగారం అమ్మకాలు 10 నుంచి 15 శాతం వరకూ అధికంగా సాగుతాయని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.