Andhra Pradesh: బాబు ‘బాహుబలి’.. మోదీ ‘భల్లాలదేవుడు’!: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
- చంద్రబాబుపై ఎన్ని కుట్రలు పన్నినా తిప్పి కొడతాం
- మా డిమాండ్లు, ఆందోళనలపై మోదీ ఎందుకు స్పందించరు?
- ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతదేశంలో భాగం కాదా?
చంద్రబాబును ‘బాహుబలి’గా, మోదీని ‘భల్లాలదేవుడు’గా టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అభివర్ణించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై ఎన్ని కుట్రలు పన్నినా తిప్పికొడతామని, తమ డిమాండ్లు, ఆందోళనలపై మోదీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతదేశంలో భాగం కాదా? అని మోదీని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పాదయాత్రపై ఆయన విమర్శలు చేశారు. ఈ పాదయాత్రకు ప్రజల ఆదరణ కరువైందని, తన సభలకు జనాలు రాకపోవడంతో పార్టీ నేతలకు జగన్ క్లాస్ తీసుకున్నట్టు తెలిసిందని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, టీడీపీ నేతలు తనతో టచ్ లో ఉన్నారని ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. టీడీపీలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని, మునిగిపోయే పార్టీలో ఎవరుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
వైసీపీ ఢిల్లీలో కాళ్ల బేరాలు .. ఏపీలో ‘హోదా’ అంటూ పోరాటాలు
కేంద్ర ప్రభుత్వంపై తాము ధర్మపోరాటం చేస్తున్నామని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ నాయకులు తిరుపతిలో ఓ పాత బైక్ ను కొని తగులబెట్టి అల్లర్లకు పాల్పడాలని ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. ఢిల్లీలో కాళ్ల బేరాలాడుతున్న వైసీపీ నేతలు, ఏపీలో మాత్రం ప్రత్యేక హోదా అంటూ పోరాటాలు చేస్తున్నారని, వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ అహర్నిశలు కృషి చేస్తోందని అన్నారు.
దేశంలోనే అత్యంత పనికిమాలిన పార్టీ వైసీపీ
కళ్లు ఉండి చూడలేని విధంగా వైసీపీ తయారైందని టీడీపీ నేత లంక దినకర్ అన్నారు. రాజధాని కోసం రైతులు భూములిస్తే రాజకీయం చేశారని, దేశంలోనే అత్యంత పనికిమాలిన పార్టీ వైసీపీ అని విమర్శించారు. మోదీ, జగన్ కలిసి కుట్రలు చేసినా చంద్రబాబును ఏమీ చేయలేరని, మోదీని ప్రశ్నించే దమ్ము జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు.