Hyderabad: మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హైదరాబాద్ జర్నలిస్టుపై ఫిర్యాదు..కేసు నమోదు
- కథువా, ఉన్నావో ఘటనల నేపథ్యంలో కార్టూన్
- కార్టూన్ పేరిట రామభక్తులను అవమానించారని ఆరోపణ
- పోలీసులకు ఫిర్యాదు చేసిన ధార్మిక సంస్థ హిందూ సంఘటన్
- కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన కార్టూన్ ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ హైదరాబాద్ జర్నలిస్టు స్వాతి వడ్లమూడిపై ధార్మిక సంస్థ హిందూ సంఘటన్ అధ్యక్షుడు కరుణాసాగర్ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కరుణాసాగర్ మాట్లాడుతూ, కథువా, ఉన్నావో ఘటనల నేపథ్యంలో ఆమె స్పందించిన తీరు బాగానే ఉందని, అయితే, ఈ అంశంలోకి హిందూ దేవుళ్లను తీసుకురావడాన్ని మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. కార్టూన్ పేరిట కోట్లాది మంది రామభక్తులను అవమానించడం సమంజసం కాదని, ఇలాంటి కార్టూన్లు వేయడం వల్ల బాధితులకు న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నించారు.
కాగా, సైబరాబాద్ పోలీసులు మాట్లాడుతూ, కరుణా సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మరిన్ని ఆధారాలు సమర్పించాలని చెప్పామని అన్నారు. జర్నలిస్టు స్వాతికి త్వరలోనే నోటీసులు పంపనున్నట్టు చెప్పారు.
ఇక తనపై వచ్చిన ఆరోపణల విషయమై స్వాతి వడ్లమూడి స్పందిస్తూ.. సమస్యలపై స్పందించడం ప్రాథమిక హక్కు అని, తాను గీసిన కార్టూన్ పై ఇప్పటికే భిన్న స్పందనలు వచ్చాయని చెప్పారు. స్వాతిపై కేసు నమోదు చేయడంపై తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మండిపడుతోంది. ఆమెపై నమోదు చేసిన కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.