britain: మోదీ పర్యటనకు ముందు కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్
- అంతర్జాతీయ సోలార్ కూటమిలో చేరుతున్నట్టు ప్రకటన
- దీనికి సారధ్యం వహిస్తున్నది భారతే
- కామన్వెల్త్ దేశాధినేతల సమావేశం నేపథ్యంలో ప్రకటన
భారత ప్రధాని బ్రిటన్ పర్యటనకు ముందు కీలక నిర్ణయం వెలువడింది. భారత్ నేతృత్వంలోని అంతర్జాతీయ సోలార్ కూటమి (ఐఎస్ఏ)లో చేరుతున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశం లండన్ లో జరగనుంది. ఇందులో భాగంగా లండన్ స్టాక్ ఎక్సేంజ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో బ్రిటన్ తన నిర్ణయాన్ని ఈ రోజు ప్రకటించింది.
2030 నాటికి తక్కువ ధరలకే విద్యుత్ ను స్థిరంగా అందించడం కోసం లక్ష కోట్ల అమెరికా డాలర్ల నిధులు సమీకరించాలన్నది అంతర్జాతీయ సోలార్ కూటమి లక్ష్యం. పేదలకు తక్కువ ధరలకే పర్యావరణ అనుకూల ఇంధనాన్ని అందించాలన్నది మోదీ సంకల్పం. అయితే, సోలార్ కూటమిలో చేరినప్పటికీ బ్రిటన్ ఎటువంటి నిధుల సాయం అందించదు. కేవలం తన అనుభవం, సూచనలు మాత్రమే అందిస్తుంది.
సోలార్ ఇంధన ఉత్పత్తి పెరిగిన కొద్దీ లక్షలాది మంది శిశువులు భద్రంగా జన్మిస్తారని, లక్షలాది రైతులు మరిన్ని పంటలను పండించగలరని, లక్షల మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందించొచ్చని బ్రిటన్ అంతర్జాతీయ వ్యవహారాల సెక్రటరీ పెన్నీ మోర్డంట్ అన్నారు.